అమ్మవారు భక్తుల హృదయాలలో ఉంటారు - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏

" భక్తమానసహంసికా " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 372 వ నామం.

" భక్తమానసహంసికా " అంటే భక్తుల మనస్సనెడి సరస్సునందలి హంసవలె ఉండునది అని అర్థం.

హిమాలయాలలోని మానససరోవరం గురించి తెలుసు అందరికీ. జీవుడి మనస్సే ఒక సరోవరం. అందులో అమ్మవారు హంసలా విహరిస్తూ ఉంటారు. హంస నీళ్ళు కలిపిన పాలలోంచి పాలను మాత్రమే గ్రహిస్తుంది. అలాగే తమ మనస్సులో అమ్మవారు హంసరూపంలో ఉన్నవారు మంచిచెడులలోని మంచిని మాత్రమే గ్రహిస్తారు. వీరిని పరమహంస అని పిలుస్తారు. ఉదా: రామకృష్ణ పరమహంస.

వీరు భౌతికవిషయాలను విస్మరించి అమ్మవారి ధ్యానంలోనే గడుపుతూ ఉంటారు. వీరు జీవన్ముక్తులు.

అమ్మవారు అన్నారు:

" నాహం తీర్థే, న కైలాసే, 

  వైకుంఠేవా న కర్హచిత్ " అని.

అంటే తీర్థాలలోనూ, కైలాసంలోనూ ఆఖరికి వైకుంఠంలోనూ ఉండను నేను " అని.

" వసామికింతు " - మరి ఎక్కడుంటావమ్మా అని అడిగితే ఆవిడ అన్నారు " మత్ జ్ఞాని హృదయాంభోజమధ్యమే " అంటే జ్ఞానుల హృదయాలలో ఉంటాను అని.

శంకరులు సౌందర్యలహరిలో అమ్మవారిని ఇలా స్తుతిస్తారు:

" సమున్మీలత్ సంవిత్   

  కమలమ కరందైకరసికం   

  భజే హంసద్వంద్వ కిమపి  

  మహతాం మానసచరమ్ ।

  యదాలాపాదష్టాదశగుణిత

  విద్యాపరిణతిర్యదాదత్తే  

  దోషాద్ గుణమఖిల

  మద్భ్యః పయ ఇవ "

‌‌    ‌             - శ్లోకం 38

మహానుభావుల యొక్క మానసములనే సరోవరమందు విహరించుచున్న హంసద్వయానికి నమస్కరిస్తున్నాను అన్నారు శంకరులు. హంసద్వయం అంటే అమ్మవారు, పరమేశ్వరుడు. వారి ధ్వనులే 18 మహావిద్యలు అన్నారు.

అమ్మవారు అలా మనస్సులో హంసలా విహరించాలంటే ఎంత కఠిన సాధన చేసి ఉండాలి, పరమభక్తులు అయి ఉండాలి, శరణాగతి పొందాలి. 

భక్తి కలగడమే ఒక వరం. మహాభారతంలో శ్రీకృష్ణపరమాత్మ అంటారు " కోటిజన్మార్జితైః పుణ్యైః భవేర్భక్తి ప్రజాయతే " - కోటిజన్మలు పుణ్యం చేస్తేనే కాని పరమేశ్వరుడిమీద భక్తి కలగదు అని.

అమ్మవారి పాదాలను ఆశ్రయించి శరణాగతిని అర్ధిద్దాం, భక్తిని కలుగచేయమని వేడుకుందాం.

ఏతత్ సర్వం శ్రీపరదేవతార్పణమస్తు - సూర్య.

శుభం భూయాత్

Comments

Popular posts from this blog

సీతమ్మతల్లికి సాటి ఎవరు? - చీమలపాటి సూర్యనారాయణ

అన్నదానం వల్ల ఎవరెవరికి పుణ్యం వస్తుంది - చీమలపాటి సూర్యనారాయణ

శ్రీసరస్వతీ దేవి పుట్టినరోజు నేడు,, శుభాకాంక్షలు అందరికీ - చీమలపాటి సూర్యనారాయణ