సంపదలన్నీ ఉన్నా కొందరికి సుఖం ఉండదు - చీమలపాటి సూర్యనారాయణ
🙏"శ్రీమాత్రేనమః"🙏
" సుభగా " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 761 వ నామం .
" సుభగా " అంటే సౌభాగ్యము గలది అని అర్ధం. అమ్మవారి సౌభాగ్యం ఎంత గొప్పదంటే దేవదానవులు పాలసముద్రాన్ని మథించినప్పుడు హాలాహలం పుట్టుకొచ్చింది. అందరూ పారిపోయారు. ఆలస్యం చేస్తే లోకాలు దహించుకు పోతాయి. అప్పుడు శివుడు ఆ హాలాహలాన్ని గ్రహించి అమ్మవారి వేపు చూస్తారు. అమ్మవారు సరే అని తల ఊపుతారు. అమ్మవారికి అంత నమ్మకం ఆవిడ సౌభాగ్యం మీద.
అమ్మవారిని నమ్ముకున్న భక్తులకు సౌభాగ్యానికి లోటుండదు.
ఆదిశంకరులు సౌందర్యలహరిలో ఇలా ప్రార్థిస్తారు అమ్మవారిని:
" హరిస్త్వామారాధ్య ప్రణతజన
సౌభాగ్యజననీం పురానారీ భూత్వా
పురరిపుమపి క్షోభమనయత్,
స్మరోఽపి త్వాం నత్వా రతినయన
లేహ్యేన వపుషా మునీనామప్యంతః
ప్రభవతి హి మోహాయ మహతామ్ "
ఓ జగన్మాతా, ప్రణమిల్లే భక్తజనులకు సౌభాగ్యాన్ని ప్రసాదించే నిన్ను పూర్వం శ్రీహరి ఆరాధించి సుందరాంగియై త్రిపురాలను తెగటార్చిన శివుడి మనస్సులో సైతం కామవికారాన్ని కలిగించి క్షోభపెట్టగలిగాడు. అలాగే మన్మధుడు నిన్ను కొలిచి తన సతి రతీదేవి కన్నులను రంజింప చేయగల సౌందర్యాన్ని పొంది ఆ రూపుతో అరణ్యాలలో తపస్సు చేసుకొనే మునుల మనస్సులలో సైతం కామాభిలాష కలిగించటానికి సమర్ధుడైనాడు.
ఆయువు, ఆరోగ్యం, ఐశ్వర్యం, భోగాలు ఉన్నా కొందరికి సుఖం ఉండదు. వీటికి తోడు భాగ్యం కావాలి. ఆ భాగ్యాన్ని అమ్మవారు అనుగ్రహిస్తారు.
అమ్మవారి పాదాలను ఆశ్రయించి అందరినీ చల్లగా చూడమని వేడుకుందాం.
ఏతత్ సర్వం శ్రీపరదేవతార్పణమస్తు - సూర్య.
శుభం భూయాత్
ప్రారబ్ద కర్మ కరిగి పోవాలంటే నిత్య హరినామ స్మరణ ఒకటే మార్గం. సుఖాలు అనుభ బించి నట్లె కష్టాలు కూడా అనుభవించే మనస్తత్వం అలవాటు చేసుకుంటే దుఖం ఉండదు.
ReplyDelete