మన మూలాలు వెతుక్కుంటూ వెనక్కు వెడితే అమ్మవారు ఉంటారు - చీమలపాటి సూర్యనారాయణ
🙏"శ్రీమాత్రేనమః"🙏
" గుహుజన్మభూః " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 606 వ నామం .
" గుహుజన్మభూః " అంటే గుహునకు అనగా కుమారస్వామికి జన్మనిచ్చినది అని. జీవులు పుట్టుచోటు అని కూడా భాష్యం చెప్పారు.
వేదంలో " అగ్నేర్యధా స్ఫులింగాః ..... " అని ఒక మంత్రం ఉంది. అగ్నినుండి స్ఫులింగములు అంటే అగ్గిరవ్వలు బయలుదేరి పైకి ఎగిరి వచ్చినట్లు పరమాత్మ నుండి జీవులు బయటకు వస్తున్నాయని ఉపమానం. యాజ్ఞవల్క్యస్మృతిలో కాల్చిన ఇనుపగుండునుంచి స్ఫులింగములు వచ్చినట్లు అని తెలియచేసారు.
అగ్నిలోంచి పైకెగిరే రవ్వలలో కూడా ఉండేది అగ్నియే కదా. అంటే పరమాత్మలోంచి వచ్చిన జీవులలో ఉండేది పరమాత్మయే. అహం బ్రహ్మాస్మి అంటే ఇదే.
మీ గోత్రం ఏమిటి అని అడుగుతూంటారు. ఋషి పేరు చెబుతాం. ఆ ఋషి ఆ గోత్రంవారికి మూలపురుషుడు. మరి ఋషుల జన్మకు కారకులు ఎవరు. అలా ఆలోచిస్తూ వెనక్కు వెడితే పరమాత్మ దగ్గరకు చేరతాం. అంటే జీవులందరకూ మూలపురుషుడు పరమాత్మ.
ఇదే విషయాన్ని పరమాత్మ గీతలో ఇలా తెలియచేసారు:
" సర్వయోనిషు కౌంతేయ
మూర్తయః సంభవంతి యాః,
తాసాం బ్రహ్మ మహద్యోనిః
అహం బీజప్రదః పితా "
- భ.గీత 14:4
" ఓ అర్జునా! నానాయోనులయందు జన్మించు ప్రాణులను తనగర్భమున ధరించు మూలప్రకృతియే ఆ ప్రాణులకు తల్లి. బీజస్థాపనచేయు నేను వాటికి తండ్రిని. అనగా సర్వప్రాణులకును ప్రకృతియే తల్లి . నేను జనకుడను " అన్నారు పరమాత్మ.
ఆశ్చర్యకరం ఏమిటంటే ఒక్క మనుషులకే కాదు. జంతువులు, పక్షులు, క్రిమికీటకాలకే కాదు వృక్షాలకు కూడా మూలపురుషుడు పరమాత్మయే.
ఆ మూలప్రకృతియే అమ్మవారు. జీవులందరూ అమ్మవారి అంశయే.
ఏతత్ సర్వం శ్రీపరదేవతార్పణమస్తు - సూర్య.
శుభం భూయాత్
Comments
Post a Comment