ధైర్యంగా ఉండాలి ఎల్లప్పుడూ - చీమలపాటి సూర్యనారాయణ
🙏"శ్రీమాత్రేనమః"🙏
" ధృతిః " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 446 వ నామం .
" ధృతిః " అంటే అందరియందున్న ధైర్య స్వరూపిణి. మనిషికి ధైర్యం చాలా ముఖ్యం. అది లేకపోతే ఏపనీ మొదలుపెట్టలేరు, ఏమీ సాధించలేరు.
" ఉద్యమః సాహసం ధైర్యం
బుద్ధిః శక్తిః పరాక్రమః
షడేతే యత్ర వర్తంతే
తత్ర దేవ సహాయకృత్ "
- సుభాషిత రత్నాకరం
ధైర్యంతో పనులను చేస్తే దేవతలు కూడా సహాయపడతారని సుభాషితం.
హనుమ లంకలో సీతమ్మను చూసి పలకరించిన తరువాత వచ్చినట్లుగానే గుట్టుగా తిరిగి వెళ్ళి పోవచ్చు. అలా వెళ్ళిపోతే రామదూత ఎలా అవుతారు. మనం రోజూ " మనోజవం మారుత తుల్య వేగం.......శ్రీరామదూతం శిరసాన్నమామి " అని ఎలా ప్రార్ధన చేస్తాం.
శతృవు బలం ఎంత, ఎటువంటి వీరులు ఉన్నారు శతృసైన్యంలో అనే విషయాలను కొంచెం తెలుసుకుంటే నయమనుకున్నారు. తను ఒంటరి, యోజనాల సముద్రం దాటి వచ్చాడు, శీఘ్రముగా తిరిగి వెళ్ళి శుభవార్త చెప్పాలి అనే విషయాలను ప్రక్కన పెట్టేసారు. ధైర్యంగా తను అనుకున్న పని చేసేసారు. రావణుడి కొడుకు అక్షయకుమారుడు తో బాటు జంబుమాలి వంటి వీరులను హతమార్చారు. హనుమను తలచుకుంటే చాలు ధైర్యం వచ్చేస్తుంది మనకు.
సైనికులు దేశసరిహద్దులను కాపాడుతూ ఉంటారు. అక్కడ వాతావరణం సరిగా ఉండదు, సరయిన ఆహారం ఉండదు, కుటుంబసభ్యులకు దూరంగా ఒంటరిగా ఉంటారు, ఏ ప్రక్కనుంచి ఏ దాడి జరుగుతుందో తెలియదు. అటువంటి పరిస్థితుల్లో పనిచేయాలంటే ఎంత ధైర్యం ఉండాలి. ఆ ధైర్యాన్ని అమ్మవారు అనుగ్రహిస్తారు.
అమ్మవారి పాదాలను ఆశ్రయిస్తే అవసరమయిన ధైర్యంని అనుగ్రహించి జీవితంలో ఉత్సాహం నింపుతారు.
ఏతత్ సర్వం శ్రీపరదేవతార్పణమస్తు - సూర్య.
శుభం భూయాత్
Comments
Post a Comment