బలిచక్రవర్తికి ఆ పేరు ఎలా వచ్చింది - చీమలపాటి సూర్యనారాయణ
🙏"శ్రీమాత్రేనమః"🙏
" బలిప్రియా " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 677 వ నామం.
" బలిప్రియా " అంటే బలవంతులను ఇష్టపడునది అని. బలవంతులు అంటే కండబలం కలవారు అనికాదు. కామక్రోధాది శతృవులను జయించిన ఉపాసకులను బలవంతులు అంటారు. ఆత్మసమర్పణను ఇష్టపడుతుంది అని అర్ధం. బలి అంటే పూజ, సమర్పణ. సమర్పణ అంటే పూర్తిగా అర్పించుకోవడం. అంతేకాని జంతుబలులు అవీ కావు.
ఒంటిమీద బట్టలు కూడా లేకుండా ఈ భూమిమీద పడ్డారు జీవులు. వారివి అంటూ ఏముంటాయి. అన్నీ అమ్మవారి ప్రసాదమే కదా. ఆ భావనతో జీవించాలి ఎల్లప్పుడూ. అదే బలి.
బలిచక్రవర్తికి ఆ పేరు ఎలా వచ్చింది. వామనుడు మూడు అడుగుల భూమి మాత్రమే అడిగాడు దానంగా. బలి అప్పటికే భూలోకాన్ని పైలోకాలనూ జయించేసాడు. ఇంద్రుడిని బయటకు పంపించేసాడు.
వామనుడు ఓ పాదంతో భూమిని ఇంకో పాదంతో పైలోకాలను ఆక్రమించారు. మూడవ పాదం ఎక్కడ పెట్టమంటావు అని అడిగారు వామనుడు. నా తలపై పెట్టు అన్నాడు బలి.
ఇందులో అద్భుత తత్వం ఉంది. మనిషి నేను, నాది అనే భావనతో బాధపడుతూ ఉంటాడు ఎల్లప్పుడూ. నాది అంటే మమ. అంటే మమకారం. నేను అంటే అహం. అంటే అహంకారం. బలి తాను సంపాదించిన లోకాలను/సంపదను ఇచ్చేసాడు రెండు అడుగులకు. అంటే మమకారం వదుల్చుకున్నాడు. తరువాత మూడవ అడుగుకోసం తలపై పెట్టమని అడిగి అహంకారంని వదుల్చుకున్నాడు.
ఉన్నదంతా దానం చేసేసారు అని అంటూంటాం, వింటూంటాం. నీది ఇచ్చేసావు సరే కాని నువ్వు ఉన్నావుగా ఇంకా. అంటే నాది, నన్ను కూడా అర్పించేసుకోవడం బలి. అటువంటి బలిని ఇష్టపడుతారు అమ్మవారు.
అన్నమయ్యని ఏదయినా రాజును సంతోషపరచు. సంపదను ఇస్తాడు. ఎన్నాళ్ళు ఈ దరిద్రపు బ్రతుకు అంటే ఆయన అంటారు:
" పుట్టుభోగులము మేము
భువి హరిదాసులము,
నట్టనడిమి దొరలు నాకియ్యవలెనా "
" పుట్టుకతోటే హరిదాసులం, హరి అనంతసంపదకు వారసులం మేము. మాకు నడమంత్రపు సిరిగాళ్ళు ఇచ్చేదేముంది " అని. అదీ బలి అంటే. కారణజన్ముడు.
అమ్మవారి పాదాలను ఆశ్రయిస్తే భక్తులకు లోటేముంటుంది. అమ్మవారు కోరుకున్న దానికన్నా ఎక్కువే ఇస్తారు. సత్ చిత్ ఆనందమే.
ఏతత్ సర్వం శ్రీపరదేవతార్పణమస్తు - సూర్య.
శుభం భూయాత్
Comments
Post a Comment