ఏపని అయినా అవుతుందనే నమ్మకంతో మొదలెట్టాలి - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏

" నిర్వికల్పా " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 176 వ నామం . 

" నిర్వికల్పా " అంటే వికల్పములు లేనిది. వికల్పము అంటే భ్రాంతి, కల్పన అన్నారు. సంకల్పం అంటే ఓ పని చేసేముందు ధృఢంగా అవాలని మొదలుపెడతాం. వికల్పం అంటే సందేహంగా ప్రారంభించడం, అనుమానంతో వదిలేయడం లాంటివి. " ఏమో, మొదలు పెట్టాను కాని అవుతుందని నమ్మకంలేదు " అనే మాటలు ఎక్కువగానే వింటూంటాం. వికల్పం.

మనకు ఇది సాధారణంగా ఎదురయ్యే పరిస్థితి. అమ్మవారి సృష్టి అంతా లయబద్ధంగా లోపరహితంగా ఉంటుంది. అమ్మవారికి వికల్పాలు ఎందుకుంటాయి.

పోతనగారు వ్యాసభాగవతం తెనిగీకరిస్తూ ఇలా వ్రాసారు:

" కలడందురు దీనులయెడ

  కలడందురు పరమయోగి

  గణములపాలం

  కలడందురన్ని దిశలను

  కలడు కలండనెడువాడు 

  కలడో లేడో " 

          - పోతనభాగవతం

" భగవంతుడు దీనులలో ఉన్నాడంటారు. ఇంకా మహాయోగుల సమూహాలలో ఉన్నాడంటారు. అన్నిదిక్కులలోనూ ఆయనే ఉన్నాడంటారు. ఉన్నాడు ఉన్నాడు అని రూఢిగా చెబుతున్న భగవంతుడు నిజంగా ఉన్నాడో? లేడో? " అన్నారు పోతన.

దీనిలో చివరన " కలడో లేడో " అన్నారు పోతనగారు. ఇది వికల్పం. సందేహం. ఆశ్చర్యం ఏమిటంటే ఇలా వ్యాసభాగవతంలో లేదని పూజ్యులు సామవేదంవారు ప్రవచనం చేస్తూ తెలియచేసారు. గజేంద్రుడు చాలా ధృఢంగా నమ్మకంతో ప్రార్ధించాడు పరమాత్మని. గజేంద్రుడు చేసినది సంకల్పం. సాక్షాత్తూ శ్రీరాముడు వచ్చి పోతనగారి పద్యాలను పూరించేవారు, మరి పోతనగారు అలా ఎందుకు వ్రాసారో. బాగా కష్టం కలిగినప్పుడు " అసలు దేముడు ఉన్నాడా " అనిపిస్తుంది ఎవరికైనా. గజేంద్రుడికి కూడా అటువంటి భావన కలిగింది అనుకున్నారేమో పోతనగారు.

అమ్మవారివి అన్నీ సంకల్పాలే. వికల్పాల అవసరం అమ్మవారికి లేదు, రాదు.

ఏతత్ సర్వం శ్రీపరదేవతార్పణమస్తు - సూర్య.

శుభం భూయాత్

Comments

Popular posts from this blog

సీతమ్మతల్లికి సాటి ఎవరు? - చీమలపాటి సూర్యనారాయణ

అన్నదానం వల్ల ఎవరెవరికి పుణ్యం వస్తుంది - చీమలపాటి సూర్యనారాయణ

శ్రీసరస్వతీ దేవి పుట్టినరోజు నేడు,, శుభాకాంక్షలు అందరికీ - చీమలపాటి సూర్యనారాయణ