అర్ధకామాలు ధర్మయుతంగా ఉండాలి - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏

" త్రివర్గనిలయా " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 873 వ నామం . 

" త్రివర్గనిలయా " అంటే ధర్మార్ధకామములకు స్థానమైనది/నిలయమైనది. పురుషార్ధాలలోని మోక్షాన్ని ఇక్కడ చేర్చలేదు, అది కఠిన సాధనతో కూడుకున్నది. ధర్మార్ధకామాలు మూడూ అమ్మవారు ఇచ్చేవే. ఆ మూడింటిలోనూ అమ్మవారు స్థితులయి ఉంటారు అనే భావనే అద్భుతం.

అన్నం కావాలన్నది కోరిక/కామం. అన్నం దొరికింది, అది అర్ధం. ఆ అన్నాన్ని కొంచెం ఇంకొకరికి పెట్టడం జరిగింది. అది ధర్మం. విషయం ఒకటే అన్నం. అందులోనే మూడూ ఉన్నాయి. అర్ధకామాలను ఒకే పురుషార్ధంగా చూడాలి. కామం వలననే అర్ధం దొరుకుతుంది.

పుట్టుక వలననో పెంపకం వలననో కొందరికి ధర్మబుద్ధి అలవడుతుంది. కాని అర్ధం/ధనం ఉండదు. కొందరికి ధనం ఉంటుంది. ధర్మబుద్ధి ఉండదు. అమ్మవారు ఈ రెండింటినీ అనుగ్రహిస్తారు.

కామం/కోరిక తప్పు కాదు. బ్రహ్మధర్మం వేరు, వ్యావహారిక ధర్మం వేరు. మనిషికి తనకంటూ కొన్ని కోరికలు, గమ్యాలు ఉంటాయి. ఆ కోరిక లోకకళ్యాణం కోసం కాకపోయినా ఇతరులకు హాని జరిగేది అయి ఉండకూడదు. అలాగే ఒకరు సమాజానికి హాని జరిగే పని చేస్తున్నాడు అని తెలిస్తే అతనిని అవసరమయితే దండించమని అమ్మవారిని కోరుకోవడం కూడా తప్పుకాదు. అటువంటి కోరిక సమాజహితం క్రిందకు వస్తుంది.

" తన్మే మనః శివసంకల్పమస్తు - సంకల్పసూక్తం " - మా మనస్సులలో ఎల్లప్పుడూ సత్సంకల్పాలే, కోరికలే కలిగేలా అనుగ్రహించమని అమ్మవారిని వేడుకుందాం.

ఏతత్ సర్వం శ్రీపరదేవతార్పణమస్తు - సూర్య.

శుభం భూయాత్

Comments

Popular posts from this blog

సీతమ్మతల్లికి సాటి ఎవరు? - చీమలపాటి సూర్యనారాయణ

అన్నదానం వల్ల ఎవరెవరికి పుణ్యం వస్తుంది - చీమలపాటి సూర్యనారాయణ

శ్రీసరస్వతీ దేవి పుట్టినరోజు నేడు,, శుభాకాంక్షలు అందరికీ - చీమలపాటి సూర్యనారాయణ