అమ్మవారు పుట్టుక లేనిది, స్వయంభూ - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏

" పూర్వజా " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 975 వ నామం.

" పూర్వజా " అంటే ముందు పుట్టినది అని భాష్యం చెప్పారు కాని పుట్టుకకు కారకులు ఉంటారు కదా. అమ్మవారికి పుట్టుక, లయలు లేవు. స్వయంభువు.

" పూర్వం దేవేభ్యో అమృతస్య నాభా ఇ " అని తెలియచేస్తూంది తైత్తిరీయోపనిషత్తు. దేవతలకు ముందర ఉన్నది, అమృతమునకు ఆధారమై/కేంద్రమై ఉన్నది అని అర్థం. దేవతలు వచ్చాకే సృష్టి మొదలయ్యింది అంటే అమ్మవారు దేవతలకు ముందే ఉన్నారని తెలుసుకోవాలి.

గజేంద్రుడు శక్తి సన్నగిల్లడంతో విష్ణువుని శరణు వేడుతూ ఇలా తలుస్తారు:

" ఎవ్వనిచే జనించు జగ

  మెవ్వని లోపల నుండు   

  లీనమై; యెవ్వని యందు  

  డిందుఁ; బరమేశ్వరుఁ   

  డెవ్వఁడు; మూలకారణం

  బెవ్వఁ; డనాదిమధ్యలయుఁ  

  డెవ్వఁడు; సర్వముఁ  

  దానయైన వాఁడెవ్వఁడు;  

  వాని నాత్మభవు నీశ్వరు నే   

  శరణంబు వేడెదన్ "

ఈ లోకమంతా ఎవరివల్ల పుడుతుందో; ఎవరిలో కలిసి ఉంటుందో; ఎవరి లోపల లయం అయిపోతుందో; ఎవరు పరమాత్ముడో; ఎవరు సృష్టికి ప్రధానకారణమై ఉన్నాడో; ఎవరైతే పుట్టడం, గిట్టడం, వాటి మధ్య అవస్థలు లేని శాశ్వతుడో; తుది, మొదలు మధ్య లేని అనంతుడో; ఎవరైతే సమస్తమైన సృష్టి తానే అయి ఉంటాడో; అటువంటి స్వయంభువు, ప్రభువు అయిన భగవంతుణ్ణి నేను శరణు కోరుతున్నాను.

పూర్వజా అంటే స్వయంభూ. 

అమ్మవారి పాదాలను ఆశ్రయిస్తే మనకు అభయం ప్రసాదిస్తారు.

ఏతత్ సర్వం శ్రీపరదేవతార్పణమస్తు - సూర్య.

శుభం భూయాత్

Comments

Popular posts from this blog

సీతమ్మతల్లికి సాటి ఎవరు? - చీమలపాటి సూర్యనారాయణ

అన్నదానం వల్ల ఎవరెవరికి పుణ్యం వస్తుంది - చీమలపాటి సూర్యనారాయణ

శ్రీసరస్వతీ దేవి పుట్టినరోజు నేడు,, శుభాకాంక్షలు అందరికీ - చీమలపాటి సూర్యనారాయణ