ధనత్రయోదశి - అడిగినదానికన్నా ఎక్కువ ఇచ్చి మాయ చేస్తారు అమ్మవారు, జాగ్రత్తగా ఉండాలి - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీరస్తు శుభమస్తు"🙏

" తాం మ ఆవహ జాతవేదో 

  లక్ష్మీమనపగామినీం " 

                - శ్రీసూక్తం.

ఇక్కడ " లక్ష్మీమనపగామినీం " అన్నారు. " అనపగామినీం " అంటే తిరిగి వెనక్కు వెళ్ళనటువంటిది. అటువంటి సంపదను ఇయ్యమని అమ్మవారిని కోరుకోవాలి.

ఎవరినైనా ఆశీర్వదించినప్పుడు " ఆయురారోగ్య ఐశ్వర్యాది భోగభాగ్యములతో జీవించుము " అని అంటారు. ఆయువు, ఆరోగ్యం, ఐశ్వర్యములంటే తెలిసినవే. భోగాలంటే సౌకర్యాలూ, పనిమనుషులు మొ.గునవి. మరి భాగ్యం ఏమిటి. ముందర నాలుగూ అంటే " ఆయువు ఆరోగ్యం ఐశ్వర్యం భోగాలు " ఉన్నా సుఖం ఉండదు చాలామందికి. 

" అశాంతస్య కుతః సుఖం ( భ.గీత 2:66 )" - " ఎప్పుడూ అశాంతిగా ఉండేవానికి సుఖం ఎక్కడిది " అన్నారు పరమాత్మ గీతలో.

" భాగ్యం " అంటే ఈ శాంతే. ఇది ఉన్న మనిషే సుఖంగా ఉండగలడు, ఏది లేకపోయినా.

ఈ శాంతిని కలుగచేసేది అమ్మవారు లక్ష్మీదేవి. ఆవిడ సంపదని ఇస్తుంది అంటారు. నిజమయిన సంపద ఈ శాంతే.

శ్రీలక్ష్మీసహస్రనామాలలో " సదదృష్టప్రదాయినీ/దురదృష్టవిఘాతినీ " అని ఉంటుంది. మంచి అదృష్టాన్ని ప్రసాదిస్తుంది, దురదృష్టాన్ని పోగొడుతుంది అని.

ఆశ్చర్యకరం ఏమిటంటే కోరుకున్నదానికన్నా అధికంగా ఇస్తుంది అమ్మవారు. వీడు తిన్నగా ఉంటాడా, సంపదతో భ్రష్టుపట్టిపోతాడా అని మాయ చేస్తుంది. విష్ణుమాయావిలాసిని. అందుకని జాగ్రత్తగా ఉండాలి. 

ఈరోజు పరమపవిత్రమయిన ధనత్రయోదశి. జీవితాన్ని సుఖమయం చేసే " భాగ్యము " ను అందరికీ ప్రసాదించమని అమ్మవారిని కోరుకుందాం.

ఏతత్ సర్వం శ్రీమహాలక్ష్మీదేవతార్పణమస్తు - సూర్య.

శుభం భూయాత్

Comments

Popular posts from this blog

సీతమ్మతల్లికి సాటి ఎవరు? - చీమలపాటి సూర్యనారాయణ

అన్నదానం వల్ల ఎవరెవరికి పుణ్యం వస్తుంది - చీమలపాటి సూర్యనారాయణ

శ్రీసరస్వతీ దేవి పుట్టినరోజు నేడు,, శుభాకాంక్షలు అందరికీ - చీమలపాటి సూర్యనారాయణ