మనిషి మొహంలో జీవం ఉంటుంది, అది అమ్మవారి అనుగ్రహం - చీమలపాటి సూర్యనారాయణ
🙏"శ్రీమాత్రేనమః"🙏
" ద్యుతిధరా " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 768 వ నామం .
" ద్యుతిధరా " అంటే కాంతిని ధరించినది అని అర్ధం. విష్ణుసహస్రనామాలలో ద్యుతిధరః అని ఒక నామం. దానికి కాంతివంతమయిన శరీరము కలవాడు అని భాష్యం చెప్పారు ఆదిశంకరులు.
ప్రతీ జీవిలోనూ జీవించి ఉన్నంత కాలం కాంతి ఉంటుంది. మరణించిన తరువాత ఉండదు. ఈ కాంతి అమ్మవారి చైతన్యం. మరీ నిరుత్సాహంగా దిగులుతో ఉన్నవారిని చూస్తే " జీవం " లేదు అనిపిస్తుంది. ఈ కాంతి జీవికి ఉత్సాహాన్నిస్తుంది.
భక్తులకు కాంతి ( అమ్మవారి చైతన్యం ) కొంచెం ఎక్కువగా ఉంటుంది. కంచి, శృంగేరి పీఠాధిపతుల ముఖాలు ప్రకాశవంతంగా ప్రశాంతంగా ఉంటాయి. కేవలం వారి దర్శనంతోనే మన మనస్సులు నిర్మలమవుతాయి.
రావణుడు యుద్ధానికి వస్తాడు ఇంద్రజిత్తు కూడా మరణించాక. రాముడు అదే మొదటిసారి రావణుడిని చూడడం. రాముడు ఆశ్చర్యపోతాడు రావణుడి తేజస్సు చూసి.
" అహో దీప్తో మహాతేజా
రావణో రాక్షసేశ్వరః "
ఇవి రావణుడిని చూడగానే రాముడి నోటివెంట వచ్చిన మాటలు. ఈ రాక్షసేశ్వరుడు ఎంత తేజస్సుతో వెలిగిపోతున్నాడు, సీతాపహరణం చేసి ఉండకపోతే ఇతను దేవలోకానికి ప్రభువు అయి ఉండేవాడేమో అని అనుకుంటారు రాముడు.
రావణుడు మహాతపస్సంపన్నుడు, కైలాసాన్నే ఎత్తి తలపై పెట్టుకున్నవాడు, శివుడిని మెప్పించి ఆత్మలింగాన్ని పొందినవాడు. మరి అటువంటి తేజస్సు కలిగి ఉండడంలో ఆశ్చర్యమేముంది.
అమ్మవారి భక్తులు అలా కళగా ప్రశాంతంగా ఉంటారు. అమ్మవారి పాదాలను ఆశ్రయించి అందరినీ చల్లగా చూడమని వేడుకుందాం.
ఏతత్ సర్వం శ్రీపరదేవతార్పణమస్తు - సూర్య.
శుభం భూయాత్
Comments
Post a Comment