శ్రీఅన్నపూర్ణాదేవి పాయసం గిన్నె, గరిటితో తిరుగుతూ ఆకలితో ఎవరయినా బాధపడుతున్నారా అని గమనిస్తూ ఉంటారుట - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏

" అద్భుతచారిత్రా " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 988 వ నామం .

" అద్భుతచారిత్రా " ఆశ్చర్యకరమగు చరిత్ర గలది. అమ్మవారి లీలలు చదివినప్పుడు, విన్నప్పుడు ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది.

మూకశంకరులు మూకపంచశతి ఆర్యాశతకంలో కామాక్షీదేవిని ఇలా కీర్తిస్తారు:

" కుసుమశరగర్వసంపత్కోశ

  గృహం భాతి   

  కాంచిదేశగతమ్,

  స్థాపితమస్మిన్కథమపి 

  గోపితమంతర్మయా   

  మనోరత్నమ్ "

            - ఆర్యాశతకం:65

మన్మధుడి గర్వానికి కారణం అమ్మవారుట. శివుడు మన్మధుడిని భస్మం చేసేసారు. కాని అమ్మవారు అనుగ్రహించారు. తనకు అమ్మవారి అనుగ్రహం ఉందనే గర్వంతో అందరినీ తన బాణాలతో బాధిస్తున్నాడుట మన్మధుడు. రతీదేవిమీద దయతో మన్మధుడిని అనుగ్రహించారు అమ్మవారు. అంత కరుణామయురాలు.

శుకమహర్షి పరీక్షిత్తుకి వృత్రాసుర వృత్తాంతం చెబుతూ అతని పూర్వజన్మ గురించి చెబుతారు. వృత్రాసురుడు పూర్వజన్మలో చిత్రకేతువు అనే చక్రవర్తి. ఎందరో భార్యలు కాని సంతానం లేదు. అంగీరమహర్షిని సేవిస్తే యాగఫలంతో కొడుకు పుట్టాడు. అసూయతో మిగతా రాణులు కుర్రాడిని చంపేసారు. లేకలేక కలిగిన కొడుకు పోవడంతో రాజు తట్టుకోలేక ఏడుస్తూనే ఉన్నాడు. నారదులతో కలిసి అంగీరమహర్షి వచ్చారు. రాజుతో నారదులు జీవుడిని మళ్ళీ ఈ కుర్రాడి శరీరంలో ప్రవేశింప చేయమంటావా అని అడిగి జీవుడిని పిలిచి వీరు నీ తల్లిదండ్రులు, మిగిలినవారు నీ బంధువులు అని చెప్పగానే జీవుడు " ఏ జన్మలో " అనడంతో రాజుతో సహా అందరూ కంగుతిన్నారు. మరణంతో అన్ని బంధాలు తెగిపోతాయి. రాజుకు వైరాగ్యం కలిగి నారదుల కాళ్ళమీద పడతాడు జ్ఞానాన్ని ప్రసాదించమని. ఆయన సంకర్షణ మంత్రాన్ని ఉపదేశించారు. ఆ నామజపం వల్ల రాజు మరుజన్మలో విద్యాధర చక్రవర్తిగా పుట్టాడు. ఓరోజు విమానంలో వెడుతూ కైలాసం చేరుకుంటాడు. శివుడి ఒడిలో అమ్మవారు కూర్చుని ఉంటారు. శివుడి ఎడమచేయి అమ్మవారి నడుముమీద ఉంటుంది. ఎదురుగా దేవతలు, ఋషులు కూర్చుని ఉంటారు. విద్యాధరుడికి కొంచెం వెగటుగా అనిపిస్తుంది. ఇంతమంది చూస్తూంటే శివుడు అమ్మవారిని అలా కూర్చోపెట్టుకోవడమేమిటి అని. శివుడు నవ్వి ఊరుకున్నారు కాని అమ్మవారికి కోపం వచ్చి " ఇక్కడున్న ఋషులు దేవతలకన్నా జ్ఞానివా నువ్వు. నీలో అసురలక్షణం ఉంది. రాక్షసుడుగా పుట్టు " అని శపించారు. అతనే వృత్రాసురుడు.

అమ్మవారి ప్రవర్తన ఆశ్చర్యంగా అనిపిస్తుంది. శివుడు మన్మధుడిని భస్మం చేస్తే అతని పని అతను చేసినప్పుడు భస్మం చేసేయడమేమిటి అని మన్మధుడిని అనుగ్రహించారు. విద్యాధరుడు శివుని గురించి తప్పుగా తలుస్తే శివుడికి కోపం రాకపోయినా అమ్మవారు కోపించి రాక్షసుడుగా పుట్టు అని శపించారు.

అమ్మవారి లీలలు అలా అద్భుతంగానూ, ఆశ్చర్యకరంగానూ ఉంటాయి. ఊహకు అందవు. అద్భుత చరిత్ర అమ్మవారిది.

" అన్నపూర్ణే సదాపూర్ణే

‌  శంకరప్రాణవల్లభే,

  జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం 

  భిక్షాం దేహి చ పార్వతి "

అన్నపూర్ణాదేవి పాయసం గిన్నె, గరిటితో తిరుగుతూ ఎవరు ఆకలితో బాధపడుతున్నారా అని గమనిస్తూ ఉంటారుట. అమ్మవారు జ్ఞానమే కాదు, జన్మరాహిత్యానికి అవసరమయిన వైరాగ్యాన్ని కూడా ప్రసాదిస్తారు.

ఈరోజు అమ్మవారు " శ్రీఅన్నపూర్ణాదేవి " అలంకారంలో అనుగ్రహిస్తున్నారు. అమ్మవారి పాదాలను ఆశ్రయించి అందరినీ చల్లగా చూడమని వేడుకుందాం.

ఏతత్ సర్వం శ్రీపరదేవతార్పణమస్తు - సూర్య.

శుభం భూయాత్

Comments

Popular posts from this blog

సీతమ్మతల్లికి సాటి ఎవరు? - చీమలపాటి సూర్యనారాయణ

అన్నదానం వల్ల ఎవరెవరికి పుణ్యం వస్తుంది - చీమలపాటి సూర్యనారాయణ

శ్రీసరస్వతీ దేవి పుట్టినరోజు నేడు,, శుభాకాంక్షలు అందరికీ - చీమలపాటి సూర్యనారాయణ