శ్రీ గాయత్రీదేవి మంచిచెడులను తెలియచేస్తారు - చీమలపాటి సూర్యనారాయణ
🙏"శ్రీమాత్రేనమః"🙏
" ధర్మాధర్మవివర్జితా " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 255 వ నామం.
" ధర్మాధర్మవివర్జితా " అంటే ధర్మాధర్మములు రెండునూ లేనిది అని.
ధర్మం దేశకాలవర్ణాశ్రమాలను బట్టి మారుతూ ఉంటుంది. దేశం అంటే ప్రదేశం. ఒకచోట ధర్మమయినది ఇంకో చోట అధర్మం అవచ్చు. ఇప్పుడు ధర్మమయినది తరువాత అధర్మం అవచ్చు. ఒక్కోసారి ధర్మాధర్మ నిర్ణయం కష్టం కావచ్చు.
పాము కప్పను పట్టుకుంది. కప్పను కాపాడడం ధర్మం. కాని పాము నోటినుంచి ఆహారాన్ని లాగేయడం ధర్మమా?.
దేవహూతి భర్త కర్దమునితో " ఇంతకాలం ఈ దేహంతో భోగాలన్నీ అనుభవించాను కాని జ్ఞాని అయిన భర్త లభించినా సత్యం ఏమిటో తెలుసుకునే ప్రయత్నమే మొదలు పెట్టలేదు " అని చెబుతూ ఇలా అంటారు:
" నేహయద్కర్మ ధర్మాయ
న విరాగాయ కల్పతే
నా తీర్థపద సేవాయై
జీవన్నపి మృతోహితః "
" ధర్మకార్యాలు చేయనివాడు జీవించి ఉన్నా మరణించినవాని క్రింద లెక్క. ధర్మకార్యాలు చేస్తూ ఉన్నా ఫలాన్ని ఆశించకుండా చేయకపోతే జీవన్మృతుడి క్రింద లెక్క. ఫలితాన్ని ఆశించకుండా ధర్మకార్యాలు చేస్తూన్నా అది భక్తిగా మారకపోతే మరణించినవాని క్రింద లెక్క " అన్నారు దేవహూతి.
ధర్మకార్యాలు చేసినా ఫలితాన్ని ఆశించకుండా, భక్తిభావంతో చేయాలి. మనకే ధర్మాధర్మాల గురించి ఇంత సంశయం ఉంటే అమ్మవారికి ధర్మం అధర్మం అనే భావన ఎందుకుంటుంది. అవి జీవుడు గమనించుకోవలసినవి. ఇటువంటి విచక్షణా జ్ఞానంని బుద్ధిని ప్రచోదన చేయడంద్వారా అనుగ్రహిస్తారు శ్రీగాయత్రీదేవి అమ్మవారు.
ఈరోజు అమ్మవారు శ్రీగాయత్రీదేవి అలంకారంలో అనుగ్రహిస్తున్నారు. అమ్మవారి పాదాలను ఆశ్రయించి భక్తిని ప్రసాదించమని వేడుకుందాం.
ఏతత్ సర్వం శ్రీపరదేవతార్పణమస్తు - సూర్య.
శుభం భూయాత్
Comments
Post a Comment