అమ్మవారు అడిగినదానికన్నా ఎక్కువ ఇస్తారు, జాగ్రత్తగా ఉండాలి - చీమలపాటి సూర్యనారాయణ
🙏"శ్రీమాత్రేనమః"🙏
" వాంఛితార్ధప్రదాయినీ " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 989 వ నామం
" వాంఛితార్ధప్రదాయినీ " అంటే కోరినవన్నీ ఇస్తారు అని. అమ్మవారు ఇవ్వలేనిది ఏముంటుంది.
ఆవిడ అమ్మ కనుక అడగకుండానే ఇస్తుంది. భక్తితో కోరుకుంటే కోరుకున్నదానికన్నా ఎక్కువే ఇస్తుంది. మనం ధర్మార్ధకామాలనే కోరుకున్నా అమ్మవారు సంతోషిస్తే ఊహించని మోక్షాన్ని కూడా ప్రసాదిస్తారు.
మూకశంకరులు ఆర్యాశతకంలో కామాక్షీదేవిని ఇలా కీర్తిస్తారు:
" కామపరిపంథికామిని కామేశ్వరి
కామపీఠమధ్యగతే,
కామదుఘా భవ కమలే
కామకలే కామకోటి కామాక్షి"
- శ్లోకం 49
" కామపీఠము మధ్యనున్నదానా, లక్ష్మీస్వరూపము గలదానా కోట్లాది కామములు నీయందున్నవి. భక్తుల కోరిన కోర్కెలు అనుగ్రహించుదానవు. నీవు నా కోర్కెలు తీర్చు తల్లీ " అని.
ఈ శ్లోకంలో అమ్మవారిని " కామకోటి " అన్నారు మూకశంకరులు. కోట్లకొలదీ కోరికలు ఉంటాయిట అమ్మవారి దగ్గర, భక్తులకు ఇవ్వడానికి. ఏది కోరినా లేదనరు.
హిరణ్యకశిపుడిని సంహరించాక నరసింహస్వామి ప్రహ్లాదుడిని ఒడిలో కూర్చోపెట్టుకుని " ఏదయినా కోరిక కోరుకో " అంటారు. ప్రహ్లాదుడు " నన్ను మోహంలో పడేయకు స్వామి, కోరిక అంటే మళ్ళీ దేహంమీద మమకారం పెరుగుతుంది " అంటాడు. అమ్మవారు ఇస్తున్నారు కదా అని అవసరంలేని కోరికలు కోరుకోకూడదు.
కోరిక ధర్మబద్ధంగా కూడా ఉండాలి. అమ్మవారు మనం కోరుకున్నదాని కన్నా ఎక్కువ ఇచ్చి మాయ చేస్తారు. తట్టుకోవడం కష్టం, బురదలో కూరుకుపోతాం. జాగ్రత్తగా ఉండాలి.
ఏతత్ సర్వం శ్రీపరదేవతార్పణమస్తు - సూర్య.
శుభం భూయాత్
Comments
Post a Comment