ధనం సంపాదనే కాదు, ఖర్చు కూడా ధర్మబద్ధంగా ఉండాలి - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏

" పురుషార్ధప్రదా " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 291 వ నామం.

" పురుషార్ధప్రదా " అంటే పురుషార్ధాలను అనుగ్రహించునది అని అర్ధం.

పురుషార్ధాలు అంటే చతుర్విధ పురుషార్ధాలు. ధర్మ అర్థ కామ మోక్షాలు.

కామం అంటే కోరిక. అది తప్పు కాదు. ఉండాలి కూడా. కోరిక కలిగితే దాన్ని పొందడానికి సాధన చేస్తారు. కోరిక ధర్మబద్ధంగా ఉండాలని మాత్రమే సనాతనధర్మం చెబుతూంది. అర్ధం అంటే ధనం. అదీ ముఖ్యమే. ఓ యాగం చేయాలన్నా కాశీయో రామేశ్వరమో వెళ్ళాలన్నా ధనం అవసరమే కదా. కాని ఆ ధనం కూడా ధర్మబద్ధంగా సంపాదించినదే అయి ఉండాలి.

ఆశ్చర్యం ఏమిటంటే భారతం ఉద్యోగపర్వంలో ఓ అద్భుత శ్లోకం ఉంది:

" న్యాయాగతస్య ద్రవ్యస్య 

  బోద్ధవ్యౌ ద్వావతిక్రమౌ,

  అపాత్రే ప్రతిపత్తిశ్చ 

  పాత్రేచ అప్రతిపాదనం " 

ధనం సంపాదనే కాదు ఖర్చుచేయడం కూడా ధర్మబద్ధంగా ఉండాలి అని తెలియచేసారు.

శంకరాచార్యులు సౌందర్యలహరి గానంచేస్తూ ఇలా ప్రార్థిస్తారు:

" త్వదన్యః పాణిభ్యా-మభయ

  వరదో దైవతగణ  స్త్వమేకా నైవాసి

  ప్రకటితవరాభీత్యభినయా  

  భయాత్త్రాతుం దాతుం ఫలమపి చ   

  వాంఛాసమధికం శరణ్యే లోకానాం 

  తవ హి చరణావేవ నిపుణౌ "

" అమ్మా ! లోకములకు దిక్కు అయిన తల్లీ మిగిలిన దేవతలు అందరూ అభయ ముద్రలను కలిగి ఉన్నారు , అందరు దేవతలకు ముఖ్యమయిన నీవు మాత్రము వరాభయ గుర్తులు అయిన ప్రకటిత ముద్రల అభినయము కల దానవు. అయితే నీ పాదములే, కోరక ముందే కోరికలు తీర్చి భయములు పోగొట్టును కదా "

దీనిలో " ఫలమపి చ వాంఛాసమధికం " అన్నారు శంకరులు. వాంఛాసమధికం అంటే కోరుకున్నదానికన్నా ఎక్కువగా అని.

మనుషులందరూ దృష్టి పెట్టేది " అర్ధం కామం " మీదే. కాని ఈ రెండింటినీ ధర్మంతో చేస్తే అమ్మవారు మోక్షాన్ని కూడా ప్రసాదిస్తారు. ధర్మాచరణ చేసేవారంటే అంత ప్రేమ అమ్మవారికి.

ఈరోజు అమ్మవారు " శ్రీమహాలక్ష్మీదేవి " అలంకారంలో అనుగ్రహిస్తున్నారు. అమ్మవారి పాదాలను ఆశ్రయిస్తే ధనాన్ని ధర్మబద్ధంగా మాత్రమే పొందేలా అనుగ్రహిస్తారు.

ఏతత్ సర్వం శ్రీపరదేవతార్పణమస్తు - సూర్య.

శుభం భూయాత్

Comments

Popular posts from this blog

సీతమ్మతల్లికి సాటి ఎవరు? - చీమలపాటి సూర్యనారాయణ

అన్నదానం వల్ల ఎవరెవరికి పుణ్యం వస్తుంది - చీమలపాటి సూర్యనారాయణ

శ్రీసరస్వతీ దేవి పుట్టినరోజు నేడు,, శుభాకాంక్షలు అందరికీ - చీమలపాటి సూర్యనారాయణ