అమ్మవారి పాదాలను ఆశ్రయిస్తే అనవసరమయిన బంధాలు తగ్గిస్తారు - చీమలపాటి సూర్యనారాయణ
🙏"శ్రీమాత్రేనమః"🙏
" విశృంఖలా " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 834 వ నామం .
" విశృంఖలా " అంటే ప్రతి బంధకములు లేనిది.
అమ్మవారికి కర్మలూ ఉండవు, కర్మఫలాలూ ఉండవు. ప్రతిబంధకాలు ఎలా ఉంటాయి.
మనకే ప్రతిబంధకాలు ఉండేది. సమాజం మనల్ని మనంగా బ్రతకనివ్వదు. పుణ్యకార్యం చేయాలన్నా ఎన్నో ప్రతిబంధకాలు. పాపఫలమే కాదు పుణ్యఫలము కూడా నశించాలి. అప్పుడే మళ్ళీ జన్మ లేకుండా ముక్తి లభిస్తుంది. కొద్దిగా పుణ్యఫలం మిగిలినా దానిని అనుభవించడానికి మళ్ళీ జన్మ తీసుకోవలసి వస్తుంది.
మనకు ఇష్టంలేని, చేయకూడదనుకున్న పనులు కూడా మనప్రమేయం లేకుండా చేసేస్తూంటాం.
పరమాత్మ గీతలో ఇలా అంటారు:
" స్వభావజేన కౌంతేయ
నిబద్ధః స్వేన కర్మణా,
కర్తుం నేచ్ఛసి యన్మోహాత్
కరిష్యస్యవశో2పి తత్ "
- భ.గీ 18:60.
" నీవు చేయుటకు ఇష్టపడని పనులు కూడా పురాకృత స్వాభావిక కర్మలచే బంధింపబడి
చేయుదువు " అన్నారు పరమాత్మ.
ఆయనకేమండీ మొదట్లో కష్టపడ్డా సమస్తభోగాలూ అనుభవించాడు అని తరచు వింటూంటాం. అంటే పాపఫలం పుణ్యఫలం రెండూ అనుభవించాడు అనుకోవాలి. అందుకే భోగాలు కూడా అనుభవిస్తూ ఉండాలి పుణ్యఫలం ఖర్చవడానికి. లేకపోతే జననమరణచక్రంలో పడి తిరుగుతూ ఉంటాం.
శ్రీసూక్తంలో అమ్మవారిని " సిద్ధలక్ష్మీః మోక్షలక్ష్మీః జయలక్ష్మీః సరస్వతీ " అని ప్రార్ధిస్తాం. సరస్వతి అంటే తామరకొలనులో ఉద్భవించినది అని భాష్యం చెప్పారు. తామరాకు, పద్మం ఎప్పుడూ నీటిలో ఉన్నా ఆ నీరు వాటికి అంటదు. అమ్మవారు అలా ఉంటారు.
అమ్మవారి పాదాలను ఆశ్రయిస్తే కర్మఫలాలను అనుభవించడంలో ఏర్పడే ప్రతిబంధకాలను తొలగిస్తుంది. అంటే అటువంటి జ్ఞానాన్ని ప్రసాదిస్తారు.
ఈరోజు అమ్మవారు " శ్రీసరస్వతీదేవి " అలంకారంలో అనుగ్రహిస్తున్నారు. అమ్మవారి పాదాలను ఆశ్రయిస్తే అవసరమయిన జ్ఞానాన్ని ప్రసాదిస్తారు.
ఏతత్ సర్వం శ్రీపరదేవతార్పణమస్తు - సూర్య.
శుభం భూయాత్
Comments
Post a Comment