మనిషి వృక్షంలా బ్రతకాలంది భాగవతం - చీమలపాటి సూర్యనారాయణ
🙏"శ్రీరస్తు శుభమస్తు"🙏
" పత్రపుష్పఫలచ్ఛాయా
మూలవల్కలదారుభిః .
గంధనిర్యాసభస్మాస్థితోక్మైః
కామాన్ వితన్వతే "
-మహాభాగవతం 10:22:34
బాలకృష్ణుడు గోపబాలకులతో అన్న అద్భుత విషయం ఇది:
వృక్షం ఒక తపస్సు చేసుకునే ఋషి లాంటిది, పవిత్రమయినది. వృక్షం మొత్తం సమాజానికి ఉపయోగపడేదే. ఆకులు, పుష్పాలు, ఫలాలు, వ్రేళ్ళే కాదు ఎండగా ఉన్నా వానవచ్చినా నీడను ఇస్తుంది. కాల్చినా బొగ్గులు, బూడిద కూడా ఉపయోగపడేదే. వృక్షాన్ని చూసి మానవుడు నేర్చుకునేది చాలా ఉంది. వృక్షం ఎప్పుడూ ఇవ్వడమే కాని ఏదీ కోరుకోదు.
ఉపనిషత్తులు ఇలా చెబుతున్నాయి :
" వృక్షైవ స్తబ్దో దివితిష్టతి "
అంటే చెట్టువలె స్తబ్దుగా ( పరమప్రశాంతంగా, గంభీరంగా ) ఆకాశంలో కూర్చుని ఉంటారు పరమాత్మ అని. ఎంత అద్భుత భావన/పోలిక. చెట్టు చూడండి. ఒకతను కాయలను/పళ్ళను జాగ్రత్తగా గౌరవంగా కోస్తాడు. ఇంకొకతను రాళ్ళతో కొడతాడు కాయల కోసం. చెట్టుకు ఎన్నో చోట్ల రాళ్ళదెబ్బలు తగులుతాయి. అలా అని రాళ్ళతో కొట్టినవానికి రుచిలేని లేక చేదు కాయ ఇవ్వదు. ఇద్దరికీ రుచికరమైన కాయలు, పళ్ళు ఇస్తుంది.
మనిషి కూడా చెట్టులా ప్రవర్తించాలి అంటారు పరమాత్మ:
" ఏతావజ్జన్మసాఫల్యం
దేహినామిహ దేహిషు .
ప్రాణైరర్థైర్ధియా వాచా
శ్రేయ ఏవాచరేత్సదా "
-మహాభాగవతం 10:22:35
" ప్రతి ఒక్కరూ దేవుడిచ్చిన ఈ దేహంచే ప్రాణంచే సంపదచే బుద్ధిచే మాటచే ఇతరులకు, సమాజానికి శ్రేయస్సు కలిగేలా జీవించాలి " అంటారు పరమాత్మ.
ఎంత అద్భుతం మన సనాతనధర్మం. వేల సంవత్సరముల క్రితమే వృక్షాలను గౌరవించమంది, పూజించమంది, ఎంతో జాగ్రత్తగా రక్షించుకోమంది.
ఇంతకాలానికి ప్రభుత్వాలకు, సమాజానికి కొద్ది కొద్దిగా అర్ధమవుతూంది మన సనాతనధర్మం గొప్పదనం.
" వృక్షో రక్షతి రక్షితః "
ఏతత్ సర్వం శ్రీకార్తీకదయాదామోదార్పణమస్తు - సూర్య
శుభం భూయాత్
Comments
Post a Comment