శ్రీయాజ్ఞవల్క్యమహర్షి జయంతి నేడు. - సమాజసేవే ముఖ్యం - చీమలపాటి సూర్యనారాయణ
🙏"శ్రీరస్తు శుభమస్తు"🙏
శ్రీయాజ్ఞవల్క్యమహర్షి జయంతి నేడు.
" శ్రీయాజ్ఞవల్క్యమహర్షి" పలు " ధర్మశాస్త్ర " విషయాలు చెప్పారు. అది " యాజ్ఞవల్క్యస్మృతి " గా ప్రసిద్ధిచెందింది.
వేదాలలో ఒకటి అయిన యజుర్వేదాన్ని తరువాత కాలంలో సులువుగా అధ్యయనం చేయడానికి రెండుభాగాలుగా చేసారు. వాటిలో శుక్లయజుర్వేదంని ప్రతిపాదించినది ఈ " యాజ్ఞవల్క్యమహర్షి ". అద్భుతమయిన " ఈశావాస్యోపనిషత్తు " ఈ శుక్లయజుర్వేదంలోనిదే.
బృహదారణ్యకోపనిషత్తులో యాజ్ఞవల్క్యమహర్షి తన భార్య మైత్రేయికి చెబుతారు కొన్ని అద్భుత విషయాలు. ఆయన ఎన్నో విషయాలు ఒక్కొక్కటీ చెప్పుకొస్తారు. ఉదా: పిల్లవాడు మనవాడయితేనే ప్రియం. ఆవులాంటి జంతువులు మనవయితేనే ప్రియం. ఇలాంటివి చాలా చెబుతారు మహర్షి.
" ఆత్మనస్తు కామాయ సర్వం ప్రియం భవతు " - మనదనుకొన్న కోరికలు మాత్రమే అన్నీ ఇష్టమవుతాయి మనుషులకు " అని.
కుక్క ఒకటే కాని మనదయితే ఆప్యాయంగా ప్రేమగా చూస్తాం. వేరే వాళ్ళదయితే " ఛీ ఛీ " అని కర్ర పట్టుకుని తరుముతాం. మనదీ అని ఒక బంధం, మనకు ఉపయోగపడుతుంది అనే కోరిక.
" బ్రహ్మ సత్యం " అని కదా. ఆ సత్యాన్ని తెలుసుకోవడం ఎలా అనే విషయమై ఋషులందరూ ఒకసారి సమావేశమయారు. సత్యాన్ని తెలుసుకోవడం కన్నా అసత్యాన్ని గుర్తిస్తూ " నేతి ( న+ఇతి ), నేతి " - ఇది కాదు, ఇది కాదు - అనుకుంటూ ఎదరకు సాగడమే ఉత్తమం అని తేల్చారు.
ఈ " అసత్యాన్వేషణ ( నేతి - న+ఇతి )" పద్ధతిని ప్రతిపాదించినది యాజ్ఞవల్క్యమహర్షి.
ఓ ఉదాహరణ చూద్దాం. అమ్మవారి ఒకనామం " పరమాణుః " - అంటే అణువుకన్నా పరము/భిన్నము అయినది. అణువు అంటే చిన్నది/సూక్ష్మమయినది. పరమాణువు అంటే అతిచిన్నది అని. మరి ఎంత చిన్నది అంటే ఋషులకు కూడా కష్టమే చెప్పడం. అందుకని నేతి ( న+ఇతి - ఇది కాదు ), నేతి అనుకుంటూ వెడితే అసలు విషయం తెలుస్తుంది. ఇది అసత్యం, ఇది అసత్యం అనుకుంటూ వెడితే సత్యం బయటపడవచ్చు. బియ్యంలో రాళ్ళు ఏరేసినట్లుగా.
మొదట పదార్ధమూలం ( ధాతువు ) చిన్నదనుకున్నారు. తరువాత ప్రోటాన్స్, ఎలక్ట్రాన్స్ అవీ చిన్నవనుకున్నారు. మొన్న హిగ్స్ బోసన్ ని కనిపెట్టి ఇదే చిన్నదని " గాడ్ పార్టికల్ " అని పేరుకూడా పెట్టేసారు. ఇది కాదేమో అనుకుని ప్రయత్నాలు ( అసత్యాన్వేషణ ) కొనసాగిస్తే రేపు ఇంకా చిన్నది కనిపెట్టే అవకాశం లేకపోలేదు.
మన సనాతనధర్మం ఎంతగొప్పదో తెలుస్తుంది " యాజ్ఞవల్క్యస్మృతి " చదివితే.
ఒక శ్లోకం/స్మృతి గురించి తెలుసుకుందాం:
" శ్రాంతసంవాహనం,
రోగిపరిచర్య, సురార్చనం,
పాదశౌచం, యజోద్యిష్ట
మార్జనం, గోప్రదానవ్రత్ ".
" శ్రాంతసంవాహనం " అంటే అలసిపోయినవారిని ఆదుకోవడం.
" రోగిపరిచర్య " అంటే రోగులకు సేవచెయ్యడం. ఈ రెండు విషయాలతరువాతే " సురార్చనం " అంటే దేవతలకు పూజ, విద్వాంసులని గౌరవించడం చేయాలని చెప్పారు.
ఇలా చేసినవారికి " గోదానఫలం " వస్తుందని మహర్షి తెలియచేసారు.
వేల సం.ల క్రితమే మన ఋషులకు ఎంతటి సామాజికస్పృహ. ఎంతటి అద్భుత విషయాలతో కూడినది మన సనాతనధర్మం. అందుకే అది నిత్యనూతనంగా ఉంది/ఉంటుంది. మధ్యలో వచ్చినవి మధ్యలోనే ముగుస్తాయి.
" నాన్యపంథా అయనాయ విద్యతే ( పురుషసూక్తం )" - సనాతనధర్మం తప్ప వేరే దారిలేదు ప్రపంచశాంతికి. కిం సంశయం?.
అందరికీ శ్రీయాజ్ఞవల్క్యమహర్షి జయంతి శుభాకాంక్షలు.
ఏతత్ సర్వం శ్రీకార్తీకదయాదామోదరార్పణమస్తు - సూర్య.
శుభం భూయాత్
Comments
Post a Comment