భాగవతరసాన్ని త్రాగాలన్నారు పండితులు - చీమలపాటి సూర్యనారాయణ
🙏"శ్రీరస్తు శుభమస్తు"🙏
మహాభాగవతంని చదవడం, వినడం కాదండి, త్రాగాలి అన్నారు పండితులు. అది చెరుకురసంలా మంచిరుచిగా ఉంటుంది.
" అహం మమాసౌ పతిరేషమే
సుతో వ్రజేశ్వరస్యాఖిలవిత్తపా సతీ,
గోప్యశ్చ గోపాః సహ గోధనాశ్చ మే
యన్మాయయేత్థం కుమతిః స మే గతిః "
- మహాభాగవతం 10:08:42
" నేను నందుని భార్యని. నందుని సంపదలన్నిటికీ రాణిని. ఈ నందుడు నా భర్త, ఈ కృష్ణుడు నా కొడుకు, ఈగోవులు గోపికలు గోపాలకులు అందరూ నావారు అనేటువంటి ఈ ఇచ్ఛాసంకల్పాలు ఎవరి మాయవల్ల నాలో కలుగుతున్నాయో ఆ పరమాత్మే ఇతడు " అని అనుకుంది యశోద.
బలరామాదులు వచ్చి కృష్ణుడు మన్ను తిన్నాడని చెప్పగానే యశోద కోప్పడుతుంది. అప్పుడు కృష్ణుడు అవన్నీ అబద్ధాలే, అనుమానముంటే చూడమని నోరు తెరుస్తాడు. యశోద చూసి ఆశ్చర్యపోతుంది, ఆ నోట్లో చతుర్దశభువనాలు కనబడడంతో. యశోదకు జ్ఞానోదయం అయి పైవిధంగా భావిస్తుంది. చిన్నికృష్ణుడి నోటిలోకి చూడగానే యశోదమ్మకు జ్ఞానోదయం అయింది. క్షణకాలమే. మళ్ళీ మాయ కమ్మేస్తుంది.
క్షణమైనా ఈ బంధాలన్నీ మాయ, అశాశ్వతం, అటువంటి మాయను కలుగచేస్తున్నది పరమాత్మ అనే భావన కలగడం ఎంతటి అద్భుత విషయం.
లీల అని అంటూంటాం, వింటూంటాం. లీల కూడా కర్మయే. కాని ఆ కర్మకు ఓ కారణం, పరమార్థం ఉంటుంది. దానిలో తత్వం ఇమిడి ఉంటుంది. అందుకే అమ్మవారు/పరమాత్మ పనులను లీలలు అని అద్భుతంగా మళ్ళీ మళ్ళీ తలచుకుని ఆనందిస్తూ ఉంటాం.
దేవతలు, యక్షులు, గంధర్వులు మొ.గు వారందరూ ఆకాశంలో ఉండి చిన్నికృష్ణుడి లీలలు చూసి ఆనందించేవారుట. చిన్నికృష్ణుడితో ఆడిపాడే గోపబాలకులను చూసి అసూయ పడేవారుట.
" ఈ గోపబాలకుల ఆటలు, పాటలు, ఆహారం అన్నీ పరమాత్మతోటే. ఎంతటి పుణ్యం చేసుకుని ఉంటారు వీరు. వీరి పాదధూళిగా పుట్టినా నా జన్మ ధన్యమయి ఉండేది " అని ఆశ్చర్యపోయారుట బ్రహ్మగారు. బ్రహ్మ పదవి కూడా విలువలేనిదయింది గోపబాలకుల పాదధూళి ముందు.
ఏతత్ సర్వం శ్రీకార్తీకదయాదామోదార్పణమస్తు - సూర్య.
శుభం భూయాత్
Comments
Post a Comment