అప్పయ్యదీక్షితర్ - సెల్ఫ్ అసెస్మెంట్ - చీమలపాటి సూర్యనారాయణ

 🙏" శ్రీరస్తు శుభమస్తు"🙏

శివాంశసంభూతుడు, మహాపండితుడు అయిన అప్పయ్యదీక్షితర్ గురించి కొన్ని అద్భుతమయిన విషయాలు నెమరువేసుకుందాం.

" శివరహస్య " అనే గ్రంధంలో శివుడే స్వయంగా తన అంశతో దీక్షితర్ అనే ఆయనగా జన్మిస్తాడు అని తెలియచేసారు. 

ఈయన 1554 లో తమిళ్ నాడులోని విరించిపురంలో జన్మించారు. " విరించి " అంటే విష్ణువు. అంటే శివాంశుడు విష్ణుపురంలో జన్మించారన్నది అద్భుతవిషయం. శివవిష్ణువులు ఒక్కరే అన్నది ఈయన బోధన.

ఆయన చిన్నతనంలోనే 14విద్యలూ నేర్చుకున్నారు. ఆయన వేదాంతం, శివాద్వైతం, మీమాంస, వ్యాకరణం, అలంకారాలపై 104 గ్రంధాలు వ్రాసారు. ఆయన అద్వైతాన్ని అనుసరించారు. 

అప్పుడు చోళరాజుల సంస్థానంలో రత్నఖేత శ్రీనివాస అని పండితుడు ఉండేవారు. ఆయన అప్పయ్యగారి విద్వత్తుగురించి విని ఆయన్ని ఓడించి తనకాళ్ళు పట్టించుకోవాలని తలచి కంచి కామాక్షిని అనుగ్రహించమని ప్రార్ధిస్తారు. అమ్మవారు " అది అంత సులువుకాదు కాని నీ కూతురిని ఆయనకిచ్చి వివాహం చెయ్యి, నువ్వు మామగారు అవుతావు, ఆయన నీకాళ్ళు ఎలాగూ పట్టుకుంటాడు " అన్నారు.

అదేరాత్రి శివుడు అప్పయ్యగారి కలలో కనబడి " వెంటనే కంచి కి వెళ్ళి కామాక్షీదేవి దర్శనం చేసుకో " అని చెప్పారు. ఈయన కాంచీ వెళ్ళారు. రత్నఖేతగారు అమ్మవారు చెప్పినట్లుగా తనకూతురుని దీక్షితార్ కిచ్చి వివాహం చేసారు. 

" సెల్ఫ్ ఎసెస్మెంట్ ( స్వపరీక్ష ) " అంటూంటాం మనం ఇప్పుడు. దీక్షితార్ గారు 16వ శతాబ్దంలోనే ఆ పనిచేసారు. తన శివభక్తి నిజమైనదేనా, తన మనస్సులో శివుడిమీద ఉన్న అభిప్రాయం ఏమిటి అని తెలుసుకోవడానికి తనమీదే ఆయన ఓ పరీక్షపెట్టుకున్నారు. 

శిష్యులను పిలిచి " నేను ఉమ్మెత్త ఆకులను తింటున్నాను, నాకు పిచ్చెక్కిపోతుంది, అప్పుడు నానోటినుంచి ఏమేమి మాటలొస్తాయో అన్నీ మీరు వ్రాసిపెట్టండి. తరువాత ఈ విరుగుడు మందుని నాకు ఈఈ విధంగా ఇవ్వండి, నేను మళ్ళీ మామూలు మనిషినవుతాను " అని అన్నీ విడమరచి చెప్పి ఉమ్మెత్త ఆకులను తినేసారు. 

మెదడు సరిగ్గా పనిచేయని ఆ స్థితిలో శివుడిని స్తుతిస్తూ అద్భుతమైన 50 శ్లోకాలు చెప్పారు. దీనిని " అత్మార్పణస్తుతి " అని పిలిచినా " ఉన్మత్తపంచశత్ " గా ప్రసిద్ధిచెందింది. అంతటి శివభక్తుడు.

ఈయనే " కువలయానంద " అని ఓ అద్భుత అలంకారకావ్యం వ్రాసారు. మా పెదమేనమామగారు దీనిని తెనిగీకరించారు. మామేనమామగారు ఎన్నో సంస్కృతగ్రంధాలు వ్రాసారు. ఆయన మార్గదర్శనంలో ఎందరో ( పంజాబ్, హర్యానా, యుపి లలో కూడా ) డాక్టరేట్లు పొందారు.

కారణజన్ములు, పుణ్యపురుషులు ఎందరో మన సనాతనధర్మపరిరక్షణ కోసం ఎంతో శ్రమించారు. అలాంటి వారిని శివకేశవులకు ప్రీతికరమయిన ఈ కార్తీకమాసంలో తలచుకుని తరిద్దాం.

ఏతత్ సర్వం శ్రీకార్తీకదయాదామోదరార్పణమస్తు - సూర్య.

శుభం భూయాత్

Comments

Popular posts from this blog

సీతమ్మతల్లికి సాటి ఎవరు? - చీమలపాటి సూర్యనారాయణ

అన్నదానం వల్ల ఎవరెవరికి పుణ్యం వస్తుంది - చీమలపాటి సూర్యనారాయణ

శ్రీసరస్వతీ దేవి పుట్టినరోజు నేడు,, శుభాకాంక్షలు అందరికీ - చీమలపాటి సూర్యనారాయణ