భార్యాభర్తలు సంబంధం ఎటువంటిదో తెలియచేసింది సనాతనధర్మం - చీమలపాటి సూర్యనారాయణ
🙏" శ్రీమాత్రేనమః "🙏
" రమణలంపటా " - అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 320 వ నామం.
" రమణలంపటా " అంటే తన భర్త యందు ఆసక్తి/అనురాగం గలిగినది అని అర్ధం.
అనుమామేముంది. ఆకులు అలములు కూడా తినకుండా, మండుటెండలో నిప్పుల మధ్య నిలబడి తపస్సు చేసి శివుడిని వివాహం చేసుకుని అపర్ణగా పూజింపబడుతున్నారు అమ్మవారు.
ఆవిడకు భర్త అంటే ఎంత అనురాగమో తెలియాలంటే క్షీరసాగరమథనం కధను నెమరువేసుకోవాలి. క్షీరసాగరాన్ని మథించినప్పుడు హాలాహలం పుట్టింది ముందర. బ్రహ్మాది దేవతలతో బాటు అందరూ భయపడిపోయారు. అప్పుడు శివుడిని ప్రార్థించడం, ఆయన హాలాహలం అంతు చూడడానికి ఎదరకు రావడం జరిగింది. హాలాహలాన్ని నోట్లో వేసుకున్నారు. లోకాలన్నీ ఎక్కడ ఉన్నాయి. శివుడి ఉదరంలో. మరి హాలాహలం ఉదరంలోకి వెడితే ఎలా?.
అప్పుడు అమ్మవారు ఏ కీడు జరగకూడదని, తను " జ్వాలాతోరణం " క్రింద నుంచి భర్తతో కలిసి 3 మార్లు ప్రదక్షణం చేస్తాను అని అగ్నిదేవుడికి మ్రొక్కుకున్నారు. మన క్షేమం కోసం అమ్మవారు అంతటి కఠిన నిర్ణయం తీసుకున్నారు.
అప్పటినుండి కార్తీకపౌర్ణమి నాడు జ్వాలాతోరణం జరుపుతారు భక్తులు. అమ్మవారు స్వామితో కలిసి పల్లకీలో జ్వాలాతోరణం క్రిందనుంచి వెడుతూంటే వెనుక భక్తులు హరహరమహాదేవ అంటూ పరుగెడతారు.
రామాయణంలో సీతమ్మ ఒక ధర్మసూక్ష్మం తెలియచేసింది జాతికి. తల్లిదండ్రులు, తోబుట్టువులు, సంతానం ఎవరికయినా ఎవరి భాగ్యం వారిదే, ఎవరి కష్టాలు వారివే. కాని ఒక్క భార్యాభర్తలదే ఒకరి భాగ్యం ఇంకొకరిది. సుఖాలలోనే కాదు, కష్టాలలో కూడా ఒకరికి ఒకరు తోడు అని.
" తపస్సులోగాని బలంలోగాని సంపదలోగాని విక్రమంలోగాని తేజస్సులోగాని కీర్తిలోగాని నాతో సరితూగుతాడా రాముడు " అంటాడు రావణుడు సీతతో. అప్పుడు సీత అంటారు " నీకు మంచిమాట చెప్పడానికి ఒక్క హితుడూ లేడా. మంచిమాట చెప్పి పాలకుడను నియంత్రించే మేధావులు లేకపోతే ఆ రాజ్యం ఎదగదు ( ఇప్పుడు కొన్ని రాష్ట్రాలలో పరిస్థితి ఇదే )" అని చెబుతూ:
" అనన్యా రాఘవేణాహం
భాస్కరేణ ప్రభాయధా "
అంటారు సీతమ్మ రావణుడితో. అంటే సూర్యుడికి వెలుగు ఎలాగో నేను రాముడికి అలాగ అని. ఎంత అద్భుత ఉపమానం. సూర్యుడిని వెలుగుని విడదీయగలమా.
ఇదే విషయాన్ని రాముడు సీత అగ్నిప్రవేశం చేసే సమయంలో అంటారు. సీతారాముల బంధం అటువంటిది, విడదీయలేనిది.
అదీ భార్యాభర్తల బంధం, అలా ఉండాలి అని మన సనాతనధర్మం తెలియచేస్తూంది. మన సనాతనధర్మానికి సాటిలేదు, రాబోదు.
కార్తీకపౌర్ణమినాడు కృష్ణుడు రాధాదేవిని, రాధాదేవి కృష్ణుడిని ఆరాధిస్తారని తెలుస్తూంది. రాధాదేవిని కార్తీకపౌర్ణమి నాడు ఆరాధిస్తే విశేష ఫలితం. అనేక తంత్ర శాస్త్రాలలో ఉపాసనా పద్ధతి ఉంది. రాధాదేవి సహస్రం, మంత్రము, స్తోత్రాలు ఉన్నాయి. జపానికి రాధాదేవిగాయత్రి కూడా ఉంది.
ఏతత్ సర్వం శ్రీకార్తీకదయాదామోదరార్పణమస్తు - సూర్య.
శుభం భూయాత్
Comments
Post a Comment