పుణ్యపురుషులు మన శిరస్సుపై చేతిని ఉంచి ఆశీర్వదిస్తే శుభం - చీమలపాటి సూర్యనారాయణ
🙏"శ్రీరస్తు శుభమస్తు"🙏
" వ్యక్తం భవాన్ వ్రజభయార్తి
హరోఽభిజాతో దేవో
యథాఽఽదిపురుషః
సురలోకగోప్తా, తన్నో నిధేహి
కరపంకజమార్తబంధో
తప్తస్తనేషు చ శిరఃసు చ కింకరీణాం "
- భాగవతం 10(1):29:41
" నువ్వు ఎవరో తెలిసింది. దేవతల రక్షకుడవయిన ఆదిపురుషుడవు. నీ పద్మహస్తాన్ని మా శిరస్సుపై ఉంచి మా జన్మ జన్మల ఆర్తిని తీర్చు " అని వేడుకుంటారు గోపికలు.
పరమాత్మ చేయి తగిలితే ముక్తి తధ్యం.
గురువుకు పెద్దలకు వారి పాదాలకు నమస్కరిస్తాం మనం. అప్పుడు వారు వారి హస్తాన్ని మన శిరస్సుపై ఉంచి ఆశీర్వదిస్తారు. అది విశేష ఫలితాన్ని ఇస్తుంది. ముఖ్యంగా చిన్న పిల్లలకు ఇది బాగా అలవాటు చేయాలి. అప్పుడే వారి భవిష్యత్తు ఆశాజనకంగా ఉంటుంది.
పూతన రాక్షసి. బాలకృష్ణుడిని చంపడానికి వచ్చి ఆయనచేతిలో మరణించింది. భారీకాయం. ఎందరినో మనుషులను జంతువులను తిని ఉంటుంది. శరీరమంతా విషం పేరుకుపోయి ఉంటుంది. ఎలా వదుల్చుకోవాలి. నందుడు ఆ శరీరాన్ని చిన్న చిన్న ముక్కలుగా నరికించి ఊరుకు దూరంగా దహనానికి ఏర్పాటు చేసాడు.
ఆశ్చర్యకరంగా దహనమవుతూన్న పూతన శరీరంనుంచి మంచిగంధం, సుగంధద్రవ్యాలు కాలుస్తూన్నట్లు చక్కటి సువాసన వస్తూంది.
భాగవతం వింటూన్న పరీక్షిత్తు ఆశ్చర్యపోయి " అదెలా సాధ్యం మహర్షీ, పూతన పాపాత్మురాలు, రాక్షసి, శరీరం దహనం అవుతూంటే పుణ్యాత్ములకు లాగ చక్కటి సువాసనలు ఎలా వచ్చాయి " అని అడుగుతాడు శుకమహర్షిని.
" పూతన కృష్ణుడిని ఒడిలో కూర్చోపెట్టుకుంది. కృష్ణుడు చేతితో పూతనను తాకాడు. తాకగానే పూతన జన్మజన్మల పాపం పూర్తిగా నశించింది. పూతన శరీరం పరమపవిత్రమయి పోయింది. దహనమవుతూంటే అటువంటి సువాసనలు రావడంలో ఆశ్చర్యం ఏముంది " అంటారు శుకమహర్షి.
అంతటి కరుణామూర్తి. జీవులకు ఎలా ముక్తిని ఇద్దామా అని చూస్తూంటారు.
అందుకే గోపికలు ఒక్కసారి తమ శిరస్సుపై చేతిని ఉంచి అనుగ్రహించమని వేడుకున్నారు కృష్ణుడిని.
ఏతత్ సర్వం శ్రీకార్తీకదయాదామోదార్పణమస్తు - సూర్య.
శుభం భూయాత్
Comments
Post a Comment