భక్తియే అత్యుత్తమం - చీమలపాటి సూర్యనారాయణ
🙏"శ్రీరస్తు శుభమస్తు"🙏
" త్రైగుణ్యవిషయా వేదా
నిస్త్రైగుణ్యో భవార్జున !
నిర్ద్వంద్వో నిత్యసత్వస్థో
నిర్యోగక్షేమ ఆత్మవాన్ "
- భ.గీత 2:45
" ఓ అర్జునా! వేదములు సత్వరజస్తమోగుణముల కార్యరూపములైన సమస్త భోగములను గూర్చియు, వాటిని పొందుటకై చేయవలసిన సాధనలను గూర్చియు కూడా ప్రతిపాదించును. నీవు ఆ భోగముల యెడలను వాటి సాధనల యందును ఆసక్తిని త్యజింపుము. హర్షశోకాది ద్వంద్వములకు అతీతుడవు కమ్ము. నిత్యుడైన పరమాత్మయందే స్థితుడవు కమ్ము. నీ యోగక్షేమముల కొఱకై ఆరాటపడవద్దు. అంతఃకరణమును వశమునందుంచుకొనుము " అన్నారు పరమాత్మ.
విశ్వరూపుడు త్వష్ట ప్రజాపతి కొడుకు. పురోహితులు. బృహస్పతిని అవమానించి శక్తులు కోల్పోయిన ఇంద్రుని విశ్వరూపుడిని కలిసి చండీయాగం మొ.గు యాగాలు చేయించు, మళ్ళీ మీరు, దేవతలు శక్తిమంతులు అవుతారు అని ఆదేశించారు బ్రహ్మ గారు. విశ్వరూపుడి తల్లి రాక్షసవంశం. అందుకని విశ్వరూపుడు దేవతలకోసం యాగం చేస్తూ రాక్షసుల ఉన్నతి కోసం కూడా చేసారు. విశ్వరూపుడికి ఆ కారణంగా " దేవహేళనం " అనే పాపం వచ్చింది. ఆ కోపంతో ఇంద్రుడు విశ్వరూపుడిని సంహరిస్తాడు.
కొడుకు మరణం తట్టుకోలేక తండ్రి త్వష్ట ప్రజాపతి ఇంద్రుడిని సంహరించగల వీరుడి కోసం అభిచారహోమం చేసారు. వృత్రాసుర జననం జరిగింది.
త్వష్ట ప్రజాపతి అంతటివాడు కొడుకు అకాలమరణం తట్టుకోలేక రజోగుణానికి లోనయి వేదం ప్రతిపాదించిన అభిచారహోమం చేసారు. అదే పరమాత్మ తెలియచేసింది, రజోతమోగుణాల సంతృప్తి కోసం కూడా ఎన్నో సాధనలు తెలియచేసింది వేదం. అనన్యభక్తి అయితే ఇవేమీ ఉండవు. కేవలం శరణాగతి, ధర్మపాలనే. అందుకే భక్తిని మాత్రమే అనుసరించమన్నారు.
ఈరోజు పవిత్రమయిన నాగులచవితి. నవనాగమాతా శ్రీమానసాదేవ్యైనమః.
ఏతత్ సర్వం శ్రీకార్తీకదయాదామోదార్పణమస్తు - సూర్య.
శుభం భూయాత్
Comments
Post a Comment