కోరికలకు అంతుండదు బ్రహ్మకైనా - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీరస్తు శుభమస్తు"🙏

గరుడపురాణంలో ఓ అద్భుత శ్లోకం ఉంది:

" చక్రధరో2పి సురత్వం 

  సురత్వలాభే  సకలసురపతిత్వం,

  భవతిరుం  సురపతిరూర్ధ్వగతిత్వం 

  తథాపి ననివర్తితే తృష్ణ " 

" రాజు చక్రవర్తి అవాలనుకుంటాడు. చక్రవర్తి ఇంద్రుడు అవాలనుకుంటాడు. ఇంద్రుడు బ్రహ్మ అవాలనుకుంటాడు. కోరికకు అంతు లేదు " అని. ఇలా కోరికలు గుర్రాలులా పరిగెట్టడంలో అందరూ ఒకటే. 

బ్రహ్మగారికి కూడా ఓ ఆశ/కోరిక కలిగింది. భాగవతంలో ఓ అద్భుత సన్నివేశం ఉంది. బ్రహ్మ కృష్ణుడిని పరీక్షించడానికని ఆవుదూడలను, గోబాలకులను మాయం చేస్తారు. కృష్ణుడు విషయం గ్రహించి తన అంశతో ఆవుదూడలుగానూ గోబాలకులుగానూ మారగా అందరూ ఇళ్ళకు చేరుకుంటారు. అలా ఏడాది గడుస్తుంది. బ్రహ్మ వచ్చి చూసి ఆశ్చర్యపోతారు. తన దగ్గర ఉన్నవారంతా ఇక్కడ కూడా ఉన్నారేమిటి అని. జ్ఞానోదయం అయి కృష్ణుడిని స్తుతిస్తాడు. 

అప్పుడు అనుకుంటాడు బ్రహ్మ. ఈ గోబాలకులు ఏమి పుణ్యం చేసుకున్నారు. పరమాత్మతో ఆటలు, భోజనాలు, హాస్యాలు. ఎందుకు నాకీ బ్రహ్మ పదవి. ఈ గోబాలకుల పాద ధూళిగా పుట్టినా నా జన్మ ధన్యమయి ఉండేది అని‌.

భగవానుడు ( తనవారు పరాయివారు అనే భేదం లేనివారు ) అయినప్పటికీ కృష్ణుడు గోపికలను అనుగ్రహించాలని నిశ్చయించుకున్నారు. ఓ శరత్కాలపురాత్రి చంద్రుడు చక్కటి వెన్నెల కురిపిస్తూన్నప్పుడు శ్రీకృష్ణుడు ఓ కల్పవృక్షం వద్ద నిలుచుని వేణుగానం చేస్తున్నారు. గోపికలు ఎక్కడి పనులు అక్కడే విడిచిపెట్టేసి వచ్చేసారు. కృష్ణుడి దివ్యమంగళ రూపాన్ని చూడడం, వేణుగానం వినడంతోటే వారి పాపపుణ్యాలు నశించాయి, జన్మరాహిత్యం పొందడానికి అర్హులు అయిపోయారు. కాని వారు అనుకున్నారు " ఎందుకీ గోపిక జన్మ. కృష్ణుడి అధరాన్ని తాకుతూన్న వెదురుముక్కగా పుట్టి ఉంటే జన్మ ఎప్పుడో ధన్యమయి ఉండేది " అని.

అద్భుతమయిన పదవులు, భాగ్యములు పొందినా ఇంకా ఎక్కువగా/సులభంగా పొందాలనే కోరిక తగ్గదు ఎవరికయినా. విష్ణుమాయ.

ఏతత్ సర్వం శ్రీకార్తీకదయాదామోదార్పణమస్తు - సూర్య.

శుభం భూయాత్

Comments

Popular posts from this blog

సీతమ్మతల్లికి సాటి ఎవరు? - చీమలపాటి సూర్యనారాయణ

అన్నదానం వల్ల ఎవరెవరికి పుణ్యం వస్తుంది - చీమలపాటి సూర్యనారాయణ

శ్రీసరస్వతీ దేవి పుట్టినరోజు నేడు,, శుభాకాంక్షలు అందరికీ - చీమలపాటి సూర్యనారాయణ