కర్మలవల్లే జన్మతీసుకోవడం, కర్మలతోనే విలీనమవడం - చీమలపాటి సూర్యనారాయణ
🙏"శ్రీరస్తు శుభమస్తు"🙏
" కర్మణా జాయతే జంతుః
కర్మణ్యైవ విలీయతే
సుఖం దుఃఖం భయం
క్షేమం కర్మణ్యైవాభిపద్యతే "
- మహాభాగవతం
కర్మలవల్లే జన్మతీసుకోవడం, కర్మలతోనే విలీనమవడం. కర్మలవల్లే సుఖం, దుఃఖం, భయం, క్షేమం కలుగుతాయి.
మంచి, చెడు కర్మలకు లెక్కలు చూసి మంచి, చెడు ఫలితాలు ఇచ్చే పరమేశ్వరుడు ఒకరున్నారు.
ఈ మాటలన్నది కృష్ణపరమాత్మ.
ఓ సమయంలో గోకులంలో పెద్దలు అందరూ యాగం చేయ సంకల్పించి కావలసిన వస్తువులు అన్నీ ఏర్పాటు చేసుకుంటున్నారు. కృష్ణుడు ఏమిటి విషయం, దేనికోసం ఇవన్నీ అని అడిగితే " ఇంద్రుడి సంతృప్తి, అనుగ్రహం కోసం. ఆయన దేవతలకు ప్రభువు. పర్జన్యాలకు అధిపతి. ఆయనను సంతోషపరిస్తే చక్కటి వానలు కురిపిస్తారు, మన గోకులం సస్యశ్యామలం అవుతుంది " అంటారు.
అప్పుడు కృష్ణుడు పైవిధంగా చెప్పి కర్మలకు ఫలితాలనిచ్చే పరమేశ్వరుడు ఉండగా మధ్యలో ఈ ఇంద్రుడు ఎవరు. మీకు అంతగా చేయాలని ఉంటే మీకు సదా రక్షణ, క్షేమం కలిగించే ఈ గోవర్ధనగిరికి చేయండి పూజలు. అనుగ్రహిస్తుంది మిమ్మల్ని అని చెబుతారు.
ఎప్పుడూ మంచి ఆలోచనలే చేస్తూ మంచి పనులే చేస్తూన్నప్పుడు ఆ పరమేశ్వరుడి అనుగ్రహం ఎప్పుడూ ఉంటుంది, ఇతర దేవతలతో పని లేదు అని తెలియచేసారు పరమాత్మ.
గోవర్ధనగిరిని ఎత్తినప్పుడు కృష్ణుడి వయస్సు 7 సం.లు. అమృతమూర్తి. ఇంద్రుడు వచ్చి క్షమించమని అడిగితే కృష్ణుడు " మీ మీ అధికారాల యందు గర్వం వదలి సావధానచిత్తంతో ప్రవర్తించండి " అన్నారు.
పూజ్యులు గరికిపాటివారు తరచుగా " ఆశ్చర్యకరంగా ఉంటుంది. అన్నీ అనుగ్రహించే అమ్మవారి పాదాలను పట్టుకోమంటే అమ్మవారి దర్శనం, అనుగ్రహం కోసం ద్వారం బయట కూర్చుని ఉండే ఇతరదేవతల పూజలు జపాలు చేస్తారేమిటో జనులు " అని అంటూంటారు.
అమ్మవారి పాదాలను ఆశ్రయించి అందరినీ చల్లగా చూడమని వేడుకుందాం.
ఏతత్ సర్వం శ్రీకార్తీకదయాదామోదరార్పణమస్తు - సూర్య.
శుభం భూయాత్
Comments
Post a Comment