స్థితప్రజ్ఞుడు ఎలా కూర్చుంటారు, మాట్లాడుతారు - చీమలపాటి సూర్యనారాయణ
🙏"శ్రీరస్తు శుభమస్తు"🙏
" స్థితప్రజ్ఞస్య కా భాషా
సమాధిస్తస్య కేశవ !
స్థితధీః కిం ప్రభాషేత
కిమాసీత వ్రజేత కిం "
- భ.గీత 2:54
అర్జునుడు అడుగుతాడు పరమాత్మని " ఓ కేశవా! సమాధిస్థితుడై పరమాత్మప్రాప్తినందిన స్థితప్రజ్ఞుని యొక్క లక్షణములేమిటి? అతడు ఎట్లు భాషించును? ఎట్లు కూర్చొనును? ఎట్లు నడచును? " అని.
ఇక్కడ గ్రహించవలసినది మనిషి స్వభావం అతని సంభాషణలోనూ, నడకలోనూ, ఆఖరికి కూర్చోవడంలో కూడా తెలిసిపోతుంది అని. ఎంత అద్భుత విషయం.
ఓసారి శంకరజయంతి ఉత్సవాలలో కంచిపీఠాధిపతి శ్రీవిజయేంద్రసరస్వతీస్వామి వారు అనుగ్రహభాషణం చేసారు. పూజ్యులు సామవేదంవారు కూడా వచ్చారు. ఆయన పీఠాధిపతి కూర్చున్న సింహాసనానికి ముందర క్రింద నేలమీద సుఖాసనం వేసుకుని కూర్చున్నారు. ఎంత వినయం, నిరాడంబరత. స్థితప్రజ్ఞుల లక్షణం కూర్చునే తీరులో కూడా తెలుస్తుంది అంటే ఇదే.
కొందరు నోరు తెరిచి మాట్లాడడం మొదలెడితే చాలు చెవులు మూసుకుని దూరంగా పోవాలనిపిస్తుంది.
రామలక్ష్మణులు సీతాదేవిని వెదుకుతూ ఋష్యమూక పర్వతం వైపుకు వెడుతూన్నప్పుడు హనుమ బ్రహ్మచారి/సాధువు వేషంలో వచ్చి సుగ్రీవుని గురించి తెలియచేసి, తనను పరిచయం చేసుకుని, వీరి గురించి అడుగుతారు. హనుమ మాటలు విని రాముడు లక్ష్మణుడితో " ఋగ్వేదంలో శిక్షణ లేనివారు, యజుర్వేదంలో ధారణ లేనివారు, సామవేదంలో పాండిత్యం లేనివారు ఇలా మంగళకరంగా హృదయానికి హత్తుకునేలా మాట్లాడలేరు " అంటారు. చివరకు రాముడు " ఇటువంటి దూత ఎవరికి లభిస్తాడో అతని పనులన్నీ చక్కగా నెరవేరుతాయి " అని అంటారు.
సభలో హనుమ మాటతీరుకు రావణుడు కూడా ఆశ్చర్యపోతాడు.
స్థితప్రజ్ఞుల లక్షణాలు అలా ఉండి ఆనందాన్ని కలిగిస్తాయి.
" కొందరిని చూస్తే దండం పెట్టాలనిపిస్తుంది. కొందరిని చూస్తే మొత్తబుద్ధేస్తుంది " అనే సామెత అలానే వచ్చింది.
ఏతత్ సర్వం శ్రీకార్తీకదయాదామోదరార్పణమస్తు - సూర్య.
శుభం భూయాత్
Comments
Post a Comment