లోభమే అన్ని అనర్ధాలకు మూలం - చీమలపాటి సూర్యనారాయణ
🙏" శ్రీరస్తు శుభమస్తు"🙏
" త్రివిధం నరకస్యేదం
ద్వారం నాశనమాత్మనః,
కామక్రోధః తధా లోభః
తస్మాత్ యేతత్ త్రయం
త్యజేత్ " - భ.గీత 16:21
" కామక్రోధలోభాలు నరకద్వారాలు - కనుక వాటిని వదిలేయాలి " అని తెలియచేసారు పరమాత్మ గీతలో.
అసలు నరకం అంటే ఏమిటి. ఎప్పుడయినా ఎవరయినా ప్రయాణంచేస్తూ తుఫాన్ లో చిక్కుకున్నా " అమ్మో నరకం చూసాం/కనబడింది " అంటారు. అంటే అధికకష్టాలు అనుకోవాలి.
ఎవరైనా కష్టాలు అనుభవిస్తూంటే ఏ పాపం చేసారో అంటూంటారు. అంటే పాపం, కష్టాలు తోడుదొంగలు.
వ్యాసమహర్షి మహాభారతంలో అసలు పాపాలకి ( కష్టాలకి ) మూలం ఏమిటి అన్నది అద్భుతంగా తెలియచేసారు:
" పాపశ్చతు యదధిస్టానం
తత్ శృణుష్వ నరాధిపా,
ఏకో లోభో మహాగ్రాహో
లోభాత్ పాపం ప్రవర్తతే ".
అంటే పాపాలన్నిటికీ మూలం " లోభం " అని తెలియచేసారు.
లోభం అంటే కావాలనుకోవడం. అది అక్కడితో ఆగదు - తనకే కావాలనుకోవడం, ఇంకెవరికీ ఉండకూడదు, ద్రక్కకూడదు అనుకోవడం, అసూయ, కోపం, హింస అన్నీ ఒకటి తరువాత ఒకటి కలుస్తూంటాయి. అంటే పాపభవంతులకి పునాది "లోభం".
మరి పుణ్యం మాటేమిటి? దానికి మూలం ఏమిటి?. అది కూడా ఆయనే తెలియచేసారు:
" దమేన సదృశం ధర్మం
నాన్యం లోకేషు శుశృమః "
అంటే " పుణ్యానికి మూలం " దమం ". పుణ్యభవంతులకి పునాది " దమం ". దమం అంటే " ఇంద్రియనిగ్రహం ". స్పందించేముందు ఒక్క క్షణం ఆలోచనచేస్తే ఏ కష్టాలు దరిచేరవు.
వ్యాసర్షి అందుకే అన్నారు మహాభారతంలో :
" యదిహాస్తి తదన్యత్ర యన్నేహాస్తి నతత్ "
" ఇక్కడ ( భారతంలో ) ఉన్నదే ఎక్కడా ఉంటుంది, ఇక్కడలేనిది ఎక్కడా ఉండదు " అని. మహాభారతం అంతటి అద్భుతమైనది ( ఇతిహాసం ) కనుకే పంచమవేదంగా పూజింపబడుతూంది 5000 సంవత్సరాలుగా. అది మహాసముద్రం. లోతుకు వెళ్ళేకొలదీ ముత్యాలు, రత్నాలు లభిస్తాయి.
అదీ మన సనాతనధర్మం గొప్పదనం. దీనికి సాటి మరియొకటిలేదు, రాబోదు.
భీష్మపితామహుడు ధర్మరాజుకి వివరించిన విష్ణుసహస్రనామాల్లో " దమః " ఒక అద్భుతనామం.
అందరికీ " దమము " ను ప్రసాదించి అనుగ్రహించమని ఆ పరమాత్మని వేడుకుందాం.
ఏతత్ సర్వం శ్రీకార్తీకదయాదామోదార్పణమస్తు - సూర్య.
శుభం భూయాత్
Comments
Post a Comment