పూజ అయినా జపం అయినా కొన్ని రోజులు చేస్తే అలవాటయిపోతుంది - చీమలపాటి సూర్యనారాయణ
🙏"శ్రీరస్తు శుభమస్తు"🙏
ఆదిశంకరులు శివానందలహరి చేస్తూ శివయ్యను ఇలా స్తుతిస్తారు:
" మనస్తే పాదాబ్జే నివసతు
వచస్త్సోత్రఫణితౌ
కరశ్చాభ్యర్చాయాం శ్రుతి
రపి కథాకర్ణనవిధౌ |
తవధ్యానే బుద్ధిర్నయన
యుగళం మూర్తివిభవే
పరగ్రంథాన్ కైర్వా పరమశివ
జానే పరమతః (7వ శ్లోకం)"
" ఓ పరమేశ్వరా ! నా మనస్సు నీ పాదపద్మములందునూ , నా వాక్కు నీ స్తోత్రపాఠములు చదువుటయందునూ , నా చేతులు నీ పూజయందునూ , నా చెవులు నీ చరిత్రలను వినుటయందునూ , నా బుద్ధి నీ యొక్క ధ్యానమందునూ , నా యొక్క కన్నులు నీ దివ్యమంగళవిగ్రహం చూచుటయందునూ స్థిరపడియుండుగాక . ఇక మీద నా సర్వేంద్రియములూ పర విషయాలను ఎరుగ కుండును గాక " అని.
ఈ శ్లోకంలో ఓ అద్భుతమైన అంతర్భావం ఉంది.
పూజ్య గురువులు సామవేదంవారు ప్రవచనం చేస్తూ ( ఈ శ్లోకం గురించి కాదు ) ఓ అద్భుతమైన విషయం తెలియచేసారు.
శంకరులు శివయ్యతో " ఆశ్చర్యంగా ఉంది శివయ్యా. ఇదివరకు నేను పూజ చేయండర్రా అని చేతులను, గుడికి వెళ్ళండర్రా అని కాళ్ళను, శివయ్యను చూడండర్రా అని కళ్ళను, ప్రవచనాలు వినండర్రా అని చెవులను, శివస్తుతి చేయవయ్యా అని నాలుకను బ్రతిమలాడేవాణ్ణి. అలాంటిది ఇప్పుడు నడు గుడికి అని కాళ్ళు లాక్కు పోతున్నాయి, చూడు శివయ్యను అని కళ్ళు, శివస్తుతి చేద్దాం పద అని నాలుక, ఎక్కడ ప్రవచనాలు జరుగుతూన్నా విను అని చెవులు బలవంతపెడుతున్నాయి " అంటారు.
ఇది సహజమే. ఒకసారి అలవాటు పడితే ఏదయినా అంటే మంచయినా చెడయినా మానడం కష్టమే.
మనం కారులో హైవే మీద వెడుతూంటాం. గేరు మార్చు, ఏక్సలరేటర్ నొక్కు, బ్రేకు వెయ్యి అని అస్తమానూ ఆదేశాలు ఇవ్వం, ఇవ్వక్కరలేదు. బుర్ర, కళ్ళు, కాళ్ళు, చేతులు, చెవులు ( వెనుక నుంచి హారన్ వినబడితే సైడ్ ఇవ్వడం ) వాటి పని అవి చేసేస్తూ ఉంటాయి.
సంకల్పం చేసుకుని దాన్ని అలవాటుగా చేసుకుంటే ఇక కష్టపడక్కరలేదు.
ఈరోజు పవిత్రమయిన కార్తీక సోమవారం.
ఏతత్ సర్వం శ్రీపరమేశ్వరార్పణమస్తు - సూర్య.
శుభం భూయాత్
Comments
Post a Comment