మనం చేయకూడదు అనుకుని కూడా అటువంటి పనులను ఎందుకు చేస్తాం - చీమలపాటి సూర్యనారాయణ
🙏"శ్రీరస్తు శుభమస్తు"🙏
" స్వభావజేన కౌంతేయ
నిబద్ధః స్వేన కర్మణా,
కర్తుం నేచ్ఛసి యన్మోహాత్
కరిష్యస్యవశో2పి తత్ "
- భ.గీ 18:60.
" నీవు చేయుటకు ఇష్టపడని పనులు కూడా పురాకృత స్వాభావిక కర్మలచే బంధింపబడి చేయుదువు " అన్నారు పరమాత్మ.
ఆశ్చర్యకరంగా మనకు ఏమాత్రం సంబంధంలేని విషయాలలో కలుగచేసుకుని సమస్యలలో కూరుకుపోతూంటాం. అసలు అలా ఎలా జరిగింది అని వింతగా అనిపిస్తుంది.
రాముడు 14000 మంది ఖరదూషణాది రాక్షసులను 3 ఘడియలలో ( 72 ని.లలో ) సంహరించడం చూసిన అకంపనుడు అనే రావణదూత లంకనుచేరి రావణుడికి విషయం తెలియచేస్తాడు. " వెంటనే వెళ్ళి రాముడిని చంపేస్తాను " అని రావణుడు అంటే అకంపనుడు అంటాడు " అది అంత సులభం కాదు. అతను ధర్మమూర్తి, పాపులు ఎలా స్వర్గం చేరలేరో అలా మనం రాముడిని జయించలేం " అని " ఆ రాముడికి తన భార్య సీతే బలం. నీకు కక్ష తీర్చుకోవాలని ఉంటే అతను లేని సమయంలో అతని అందమయిన భార్యను అపహరించు " అని సలహా ఇచ్చాడు అకంపనుడు.
అప్పుడు రావణుడు మారీచుడు దగ్గరికి వెళ్ళి సీతాపహరణానికి సహాయం చేయమని అడుగుతాడు.
విషయం విని " నీకీ చచ్చు సలహా ఇచ్చింది ఎవరు. అతను 14 ఏళ్ళవయస్సులోనే మా అమ్మ తాటకిని, తమ్ముడు సుబాహుడిని చంపేసాడు. నన్ను ముప్పుతిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్ళు తాగించాడు. ఏదో అదృష్టం బాగుండి బయటపడ్డాను. ఇప్పుడు అతడు యువకుడు, అన్నీ నేర్చుకున్నవాడు. ఎవరో మునులకి సాయం కోసమే అంత చేసాడు అప్పుడు. మరి తన భార్యకు హాని చేసినవాడిని ఏమి చేస్తాడో ఊహించు. కోరి అగ్నిని లంకకు తీసుకెళ్ళి చేటు తెచ్చుకోకు. హాయిగా సంతోషంగా జీవిస్తూన్న లంకప్రజలని విగతజీవులుగా చెయ్యకు " అని చెబుతాడు.
నిజమే ఎందుకొచ్చిన గొడవ అని రావణుడు తిరిగి లంకకు వెళ్ళిపోతాడు. కాని అప్పటికే అక్కడికు చేరుకున్న శూర్ఫణఖ తన ముక్కు చెవులు కోసేసారని చెప్పి రావణుడిని నానా మాటలు అనడంతో సీతాపహరణానికి మళ్ళీ బయలుదేరుతాడు.
సీతను అపహరించాలి, రాముడి చేతిలో హతమవ్వాలి. అది రావణుడి పురాకృత కర్మఫలం. ఇష్టంలేకపోయినా రావణుడు సీతాపహరణం చేసాడు. అదే పరమాత్మ చెప్పినది.
ఏతత్ సర్వం శ్రీకార్తీకదయాదామోదరార్పణమస్తు - సూర్య.
శుభం భూయాత్
Comments
Post a Comment