రాధాదేవి శక్తిస్వరూపిణి, కృష్ణుడి ప్రేయసి కాదు - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏

రాధాదేవి శక్తిస్వరూపిణి. అమ్మవారు, గోలోకానికి ఈశ్వరి. విష్ణువు యొక్క ప్రేమ/ఆనంద స్వరూపిణి. విష్ణువు ప్రేమను, అనుగ్రహాన్ని పొందడానికి రాధాదేవి ధ్యానం ఉత్తమం. కృష్ణభక్తులు అదే చేస్తారు. రాధాకృష్ణులు ఒకరే. చంద్రుడు వెన్నెల, సూర్యుడు వెలుగు లాగ కలిసే ఉంటారు.

బ్రహ్మవైవర్తపురాణం/గర్గభాగవతంలో విస్తారంగా తెలియచేసారు రాధాదేవి గురించి.

బ్రహ్మ 6000 సంవత్సరాలు ( ఆయన సం.లు - కొందరు 60 వేల సం.లు అని భాష్యం చెప్పారు ) తపస్సు చేస్తే రాధాదేవి కాలిగోరు దర్శనం అయిందిట. బాధతో విష్ణువుకు విన్నవించుకుంటే " కృష్ణావతారంలో బృందావనంలో ఆవిర్భవిస్తుంది రాధాదేవి, అప్పుడు దర్శనం చేసుకుని తరించు " అని చెప్పారు.

మనలో చాలామందికి రాధాకృష్ణుల ప్రేమ, రాధ కృష్ణుడి ప్రేయసి అనే తెలుసు. అమ్మవారు రాధాదేవి గోకులంలో వృషభానుడి కూతురుగా, రాధగా ఆవిర్భవించింది.

దీనికో చక్కటి వృత్తాంతం చెబుతారు.

రాధాదేవికి ఓ కోరిక కలిగిందిట. విరహం చాలా మధురం అంటూంటారు కదా. ఆవిడకు విరహమే లేదు, ఇద్దరూ ఒకరే కనుక. విరహం అంటే ఎలా ఉంటుందో తెలుసుకోవాలని ఓ గోపికగా పుట్టిందని తత్త్వవేత్తల భావన.

వృషభానుడు ఓ గోకులంకి రాజు. అతని భార్య కళావతి. వీరు గతజన్మలో రాధాదేవి ఉపాసకులు. వారికి మరుజన్మలో కూతురుగా వస్తానని వరమిచ్చింది. కూతురుగా పుడతాననలేదు. ఫలానా సమయంలో ఫలానా చోట ఆవిర్భవిస్తానని చెప్పి అక్కడ వృషభానుడు, భార్య ధ్యానంలో ఉండగా దగ్గరలో ఉన్న సరోవరంలో పద్మంమీద ఆవిర్భవించింది. ఆవిడే గోకులంలో రాధాదేవి.

మంత్రాలకు అధిదేవతలు ఉంటారు. వేదమంత్రాలు విష్ణువు గురించి తపస్సు చేస్తే ఏమి కావాలి అన్నారు విష్ణువు. ఎప్పటినుంచో నిన్ను స్తుతిస్తూనే ఉన్నాం, ఎప్పుడు మేము మీలో ఐక్యమయేది, ఎప్పుడు అనుగ్రహిస్తారు అంటే కృష్ణావతారంలో గోపికలుగా పుట్టండి అన్నారు. గోపికలకు ఇంకోపేరు ఉపనిషత్కాంతలు. 

రాధాదేవి కూడా ఓ గోపికగా ఆవిర్భవించడం, అద్భుత రాసలీలతో గోపికలనందరికీ కృష్ణుడు ముక్తిని ప్రసాదించడం జరిగింది.

ఈ రాధాదేవి ఎవరూ అనే విషయం వివరిస్తూ పూజ్యులు సామవేదంవారు ఓ అద్భుతమయిన విషయం తెలియచేసారు. అమ్మ మనకోసం వంట చేయడం మొదలుపెడుతుంది. వంట ఎలా చేయడం అన్నది జ్ఞానం - సరస్వతి. వంట సరకులు/దినుసులు సంపద - లక్ష్మి. వంటచేయడం క్రియ, శక్తి - పార్వతి. ఇవి ఉంటే సరిపోతుందా, ముఖ్యంగా కావలసినది పిల్లలపై ప్రేమ, ఏదో ఒకటి చేసి తినిపించాలని. ఆ ప్రేమ‌స్వరూపిణియే రాధాదేవి. అమ్మలో నలుగురూ స్ధితులై ఉంటారు.

రాధాదేవి అమ్మవారిని పవిత్ర కార్తీకమాసంలో స్మరిద్దాం, తరిద్దాం.

ఏతత్ సర్వం శ్రీకార్తీకదయాదామోదార్పణమస్తు - సూర్య.

శుభం భూయాత్

Comments

Popular posts from this blog

సీతమ్మతల్లికి సాటి ఎవరు? - చీమలపాటి సూర్యనారాయణ

అన్నదానం వల్ల ఎవరెవరికి పుణ్యం వస్తుంది - చీమలపాటి సూర్యనారాయణ

శ్రీసరస్వతీ దేవి పుట్టినరోజు నేడు,, శుభాకాంక్షలు అందరికీ - చీమలపాటి సూర్యనారాయణ