కృష్ణలీలలు అర్ధమవాలంటే సంస్కారం ఉండాలి - వివేకానందుడు - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీరస్తు శుభమస్తు"🙏

" సంస్థాపనాయ ధర్మస్య 

  ప్రశమాయేతరస్య చ . 

  అవతీర్ణో హి భగవాన్

  అంశేన జగదీశ్వరః " - 27

" స కథం ధర్మసేతూనాం 

  వక్తా కర్తాభిరక్షితా . 

  ప్రతీపమాచరద్బ్రహ్మన్ 

  పరదారాభిమర్శనం " - 28

కృష్ణుడి రాసలీల అంతా విన్నాక పరీక్షిత్తు మహారాజు " నాకో చిన్న సందేహం. ధర్మసంస్థాపనకు భగవానుడి అంశ కృష్ణుడిగా అవతరించింది కదా. మరి పరాయివారి భార్యలతో నృత్యాలు సమంజసమా " అని అడుగుతాడు శుకమహర్షిని.

ఇది నిజంగా అతని సందేహం కాదు. వేల సంవత్సరాల తరువాత అయినా కొందరు మూర్ఖులకు, వితండవాదులకు అటువంటి సందేహం రావచ్చని భావించి దానికి వివరణ ఇవ్వడం జరిగింది. 

ఎంత అద్భుతం మన వాజ్మయం. రామాయణం, భారతం, భాగవతాలలో ఇలా సందేహం కలిగే ఘట్టాలకు అక్కడే సందేహనివృత్తి కూడా చేసారు.

శుకుడు అంటారు " ఈశ్వరాణాం వచః సత్యం తథైవా చరితం క్వచిత్ - పరమేశ్వరుడి వాక్కులు సత్యాలే. కాని వారి చరిత్ర కొంచెం సత్యంగా కనబడుతుంది " అని. ఇక్కడ " కొంచెం " అన్నారు అంటే సత్యమేనా అనే అనుమానం కలగవచ్చు అని. అసత్యం అనలేదు మహర్షి.

వారు ధర్మాధర్మాలకు అతీతులు. వారి వాక్కులు అనుసరణీయం, అనుసరించాలి. వారి లీలలు అనుస్మరణీయం, స్మరించుకుని ఆనందించాలి అంతే. లీలను వారు చేసేరు కనుక మనంకూడా చేయవచ్చా అనే ఆలోచనే తప్పు. 

వారి లీలలకు ఓ పరమార్ధం, తత్వం ఉంటాయి. శుకుడు అంటారు " రుద్రో2బ్దిజం విషం - శివుడు హాలాహలం మ్రింగారు - మనం మ్రింగడానికి ప్రయత్నించకూడదు " అని. కృష్ణుడు గోవర్ధననగిరిని ఎత్తారు, కాళీయునిపై నాట్యంచేసారు, దావానలం మ్రింగారు. మరి మనం కూడా ఆ పనులు చేయగలమా. ఒక్కొక్క గోపికతో ఒక్కో కృష్ణుడు నాట్యం చేసారు. మనం అలా చేయగలమా. 

కంచి పరమాచార్య వంటి యోగులే కర్మలు తమవి కావు, ఈశ్వర సంకల్పం అంటారు. మరి పరమాత్మ లీలలు ఆయనకోసం ఎలా అవుతాయి.

వివేకానందుడు అంటారు " కాసిన్ని కాసులకోసం, కీర్తికోసం పురుగుల్లా జీవించే వారికి మా కృష్ణుడి లీలలు ఎలా అర్ధమవుతాయి. దానికి జ్ఞానం, సంస్కారం కావాలి " అని.

లీలలను అనుగ్రహంగా భావించాలి. అలా ఎలా చేసారు, అది ధర్మమా అనే ఆలోచన చేయకుండా వాటిని సదా స్మరించుకుని ఆనందిస్తూ పరమాత్మ అనుగ్రహాన్ని పొందడానికి ప్రయత్నం చేయాలి. 

ఏతత్ సర్వం శ్రీకార్తీకదయాదామోదార్పణమస్తు - సూర్య.

శుభం భూయాత్

Comments

Popular posts from this blog

సీతమ్మతల్లికి సాటి ఎవరు? - చీమలపాటి సూర్యనారాయణ

అన్నదానం వల్ల ఎవరెవరికి పుణ్యం వస్తుంది - చీమలపాటి సూర్యనారాయణ

శ్రీసరస్వతీ దేవి పుట్టినరోజు నేడు,, శుభాకాంక్షలు అందరికీ - చీమలపాటి సూర్యనారాయణ