పవిత్రమయిన కార్తీక సోమవారం - స్వామి నామాన్ని స్మరిద్దాం - చీమలపాటి సూర్యనారాయణ
🙏" శ్రీరస్తు శుభమస్తు"🙏
ఆదిశంకరులు శివానందలహరి చేస్తూ ఇలా ప్రార్ధన చేసారు:
" ఏకో వారిజబాంధవః
క్షితినభో వ్యాప్తం
తమోమండలం,
భిత్వా లోచనగోచరోఽపి
భవతి త్వం
కోటిసూర్యప్రభః, వేద్యం కిం
న భవస్యహో ఘనతరం
కీదృగ్భవేన్మత్తమస్తత్సర్వం
వ్యపనీయ మే పశుపతే
సాక్షాత్ ప్రసన్నో భవ "
ఓ పశుపతీ ! ఒక్క సూర్యుడు భూమ్యాకాశములు నిండిన చీకట్లు తొలగించి నేత్రములకు అగుపిస్తున్నాడు. మరి నీవో, కోటిసూర్యప్రకాశవంతుడవు, తెలుసుకొనదగినవాడవు. అయిననూ నాకు నీవు కనుపించుటలేదు. నా (అజ్ఞాన) అంధకారము ఎంతదో కదా! కనుక ఆ (అజ్ఞాన) అంధకారము అంతయునూ తొలగించి, ప్రత్యక్షమై అనుగ్రహింపుము.
ఎంత చమత్కారంగా ప్రార్ధన చేసారు. ఒక సూర్యుడు వస్తేనే అంధకారమంతా పోయి సూర్యుడు కనిపిస్తారు కదా మరి పరమేశ్వరుడు కోటిసూర్యసముడైనా నా అజ్ఞానాంధకారం తొలగలేదు, పరమేశ్వరుడు కనిపించుటలేదు అంటే నా అజ్ఞానం అంత పెద్దదా అని అడుగుతున్నారు శంకరులు.
ఆయనే ఆవిధంగా అనుకుంటే ఇక సామాన్యుల ( మన ) సంగతి ఏమిటి. మన అజ్ఞానాంధకారం తొలగాలంటే " కోటికోటి " సూర్యసమమైన అమ్మవారే దిక్కుగా తెలుస్తూంది. అమ్మవారి పాదాలను ఆశ్రయిద్దాం. మనంకూడా మన అజ్ఞానాంధకారాన్ని పోగొట్టమని అమ్మవారిని వేడుకుందాం.
ఈరోజు పవిత్రమయిన కార్తీక సోమవారం. స్వామినామాన్ని స్మరిద్దాం, తరిద్దాం.
ఏతత్ సర్వం శ్రీకార్తీకదయాదామోదరార్పణమస్తు - సూర్య.
శుభం భూయాత్
Comments
Post a Comment