ఏ జన్మ అయినా ఈశ్వరుడి ధ్యానంలో గడిపితే నష్టం లేదు - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీరస్తు శుభమస్తు"🙏

" నరత్వం దేవత్వం నగవన

  మృగత్వం మశకతా, 

  పశుత్వం కీటత్వం భవతు 

  విహగత్వాదిజననం, 

  సదా తత్పాదాబ్జస్మరణ 

  పరమానందలహరీ, 

  విహారాసక్తం చేత్ హృదయమిహ

  కిం తేన వపుషాం " -10

" మనుష్యునిగా, దేవుడుగా, పర్వతంగా, వనంగా, మృగంగా, దోమగా, పశువుగా, పక్షిగా కాని పుట్టినా ఆ ఆ పుట్టుకలందు నీ పాదపద్మాలను భావించడం అనే ఆనందనదిలో ఈదులాడే తలపు ఉన్నచో ఏ పుట్టుక అయినా లోటేముంది " అని. 

ఈ శ్లోకం శంకరాచార్య విరచిత శివానందలహరి లోనిది. 

ఏ పుట్టుక అయినా శివుడి ధ్యాసలోనే ఉన్నవారు చరితార్ధులవుతారు అని భావించాలి.

"జంతూనాం నరజన్మ దుర్లభం" అన్నాయి శాస్త్రాలు. కాని శివునిధ్యాసలో లేనప్పుడు ఆ నరజన్మ వ్యర్ధం కదా. 

దేవతలకయినా ఇదే వర్తిస్తుంది. కుబేరుడు ప్రతిదినమూ ఇద్దరిని దర్శించుకుని పూజిస్తారుట. ఒకరు శివుడు, ఐశ్వర్యప్రదాత, సంపదకోసం. రెండు వెంకటేశ్వరుడు - తను అప్పుగా ఇచ్చిన ధనాన్ని వసూలు చేసుకోవడానికిట.

కొన్ని కొండలు ఉంటాయి - అరుణాచలం, సింహాచలం, భద్రాచలం, వేంకటాచలం (తిరుమల), రత్నాచలం (అన్నవరం ) మొ.గునవి. కొండగా పుడితేనే స్వామిని తమ తలపై పెట్టుకుని సేవించుకుని చరితార్ధులవుతున్నాయి.

కొన్ని అడవులు ఉంటాయి - శబరిమల, నల్లమల (శ్రీశైలం) మొ.గునవి. స్వామిని తమమధ్యలో ఉంచుకుని తరిస్తున్నాయి.

దోమపుట్టుక గురించి చెబుతూ హాస్యంగా " కొన్ని దోమలు అందరి రక్తమూ త్రాగవు, దేవుడి భక్తుల రక్తమే త్రాగుతూ తరిస్తాయి " అన్నారు పండితులు. 

అలాగే జంతువులలో కొన్ని ఏనుగులు, పశువులు దేవుడిసేవలో తరిస్తాయి.

కొన్ని పక్షులు దేవుడిగుడి గోపురాలమీద నివసిస్తూ సుప్రభాతాలూ స్తోత్రాలూ వింటూ, ప్రసాదాలు తింటూ తరిస్తాయి.

ఈరోజు పవిత్రమయిన కార్తీక సోమవారం. స్వామిని స్మరించి తరిద్దాం. ఓం నమశ్శివాయ.

ఏతత్ సర్వం శ్రీకార్తీకదయాదామోదరార్పణమస్తు - సూర్య.

శుభం భూయాత్

Comments

Popular posts from this blog

సీతమ్మతల్లికి సాటి ఎవరు? - చీమలపాటి సూర్యనారాయణ

అన్నదానం వల్ల ఎవరెవరికి పుణ్యం వస్తుంది - చీమలపాటి సూర్యనారాయణ

శ్రీసరస్వతీ దేవి పుట్టినరోజు నేడు,, శుభాకాంక్షలు అందరికీ - చీమలపాటి సూర్యనారాయణ