మన శరీరంలోని 72 వేల నాడుల కేంద్రం భృకుటి, అక్కడ బొట్టు పెట్టుకుంటే మంచిది - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏

" ఫాలస్థా " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 593 వ నామం .

" ఫాలస్థా " అంటే ఫాలమందు/ నొసటియందు ఉన్నది అని అర్ధం. అమ్మవారు అక్కడ బిందురూపంలో ఉంటారు జీవులలో. భృకుటి దగ్గర మన శరీరంలోని 72 వేల నాడుల కూడలి ఉంటుంది. అదే ఆజ్ఞాచక్ర స్థానం.

గీతలో శ్రీకృష్ణుడు యోగాభ్యాసం గురించి తెలియచేస్తూ దృష్టిని భృకుటిమీద కేంద్రీకరించమన్నారు (భ.గీత 6:13).

సాష్టాంగ నమస్కారములో ఒక అంగం నుదురు/ఫాలభాగం. నుదుటిని నేలకు తగిలిస్తాం. 

అందుకే అక్కడ బొట్టు పెట్టుకోమంది సనాతనధర్మం. నొసటిభాగం చాలా కళగా, చైతన్యవంతంగా ఉంటుంది. కళ తక్కువగా ఉన్న వారిని " ఏమయింది, అలా ఉన్నావు " అని అడుగుతూ ఉంటాం. తేలికగా తెలిసిపోతూంటుంది ఎదుటివారి మానసికస్థితి.

నుదిటి మీద బొట్టు లేకపోతే ఏదో అశుచి కలిగినట్లు భావించి వారితో పరాచికాలు చేసేవారు కాదు పూర్వం. అంతటి అద్భుత సంస్కృతి మనది.

ఆదిశంకరులు సౌందర్యలహరి చేస్తూ అమ్మవారిని ఇలా ప్రార్థిస్తారు:

" లలాటం లావణ్యద్యుతి

  విమల మాభాతి తవ 

  యద్ద్వితీయం తన్మన్యే   

  మకుట ఘటితం చంద్రశకలమ్,

  విపర్యాసన్యాసా దుభయ హమపి 

  సంభూయ చ మిథః సుధాలేపస్యూతిః 

  పరిణమతి రాకాహిమకరః " (46)

" అమ్మా నీ నుదురుభాగము పవిత్రమైన సౌందర్యారతిశయముతో ప్రకాశించుచున్నది. అట్టి ఈ లలాటభాగము నీ కిరీటమునందు కనబడకుండానున్న చంద్రుని రెండవ అర్ధభాగముగా అనిపిస్తూన్నది. కారణమేమనగా నీ లలాటమును ఆ అర్ధచంద్రుని కలిపినచో అమృతమును స్రవించు పూర్ణచంద్రుని ఆకారమును పొందుచున్నది. ఆ స్రవింపబడు అమృతముతోనే ఆరెండు అతకబడినట్లు గూడా కనబడని విధంగా కలసిపోయి పూర్ణచంద్రునివలె ప్రకాశించుచున్నది ".

మన సంప్రదాయాలను గౌరవిద్దాం, పాటిద్దాం.

ఏతత్ సర్వం శ్రీపరదేవతార్పణమస్తు - సూర్య.

శుభం భూయాత్

Comments

Popular posts from this blog

సీతమ్మతల్లికి సాటి ఎవరు? - చీమలపాటి సూర్యనారాయణ

అన్నదానం వల్ల ఎవరెవరికి పుణ్యం వస్తుంది - చీమలపాటి సూర్యనారాయణ

శ్రీసరస్వతీ దేవి పుట్టినరోజు నేడు,, శుభాకాంక్షలు అందరికీ - చీమలపాటి సూర్యనారాయణ