మిగతా మతాలు మన సనాతనధర్మం కాలిగోటికి సరిపోవు అనుకోవచ్చా - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏

" నఖదీధితిసంఛన్న నమజ్జనతమోగుణా " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్య

నామాలలో 44 వ నామం .

" నఖదీధితిసంఛిన్న నమజ్జనతమోగుణా " అంటే కాలిగోళ్ళ కాంతులచే నమస్కరించువారి అజ్ఞానమును పోగొట్టునది అని భాష్యం చెప్పారు.

అమ్మవారి కాలిగోర్లు చంద్రరేఖలలా ప్రకాశిస్తూ ఉంటాయిట. బ్రహ్మాది దేవతలు అమ్మవారి పాదాలకు నమస్కరించడం వలన వారి అజ్ఞానం తొలగుతుందని అర్ధం. దేవతల కిరీటాలలోని మణుల కాంతులు అమ్మవారి కాలిగోర్లలో ప్రతిఫలిస్తున్నాయి అని ఇంకో భాష్యం చెప్పారు.

ఓసారి చంద్రుడికి సందేహం కలిగిందిట. అప్పుడు రామచంద్రుడు అన్నారు, ఇప్పుడు కృష్ణచంద్రుడు అంటున్నారు, నేను రామకృష్ణులకన్నా అందంగా ఉంటానా అని. గోకులం వెళ్ళి కృష్ణుడిని చూసి ఆయన అందానికి ముగ్ధుడయి సూర్యుడి ముందు దివిటీలా ఉన్నాను, నా అందం ఏపాటి అనుకుని బాధతో పది ముక్కలయాడుట. ఆ పది ముక్కలూ కృష్ణుడి పాదాల గోరులయి తరించాయిట. 

శివమహిమా స్తోత్రంలో పుష్పదంతాచార్యులు ఇలా వ్రాసారు:

" అసితగిరి సమం స్యాత్కజ్జలం 

   సింధుపాత్రే సురతరువరశాఖా 

  లేఖనీ పత్రముర్వీ,

  లిఖతి యది గృహీత్వా

  శారదా సర్వకాలం తదపి   

  తవ గుణానామీశ పారం న యాతి "

ఓసారి దేవతలందరూ కలిసి మాట్లాడుకుంటూన్నప్పుడు వారికి శివుడి రూపాన్ని వర్ణిస్తూ ఓ గ్రంధం వ్రాయాలనిపించిందిట. 

వేదాలు వర్ణనని మేము చెబుతాము అన్నాయి. ఎవరు వ్రాస్తారు అంటే సరస్వతీదేవి వ్రాస్తానన్నారు. ఎక్కడ, దేనిమీద వ్రాయాలి ఆనుకున్నారు. భూమి తనను తాళపత్రంగా చేసుకుని వ్రాయమన్నారు. మరి సిరా ఎలా. సముద్రుడు, కాటుక కొండ తాము సహాయపడతామన్నారు. కాటుక కొండని సముద్రంలో కలిపారు. సిరా తయారయింది. కలం ఎలా అంటే కల్పవృక్షం తాను తయారు అంది. ఆ చెట్టు కొమ్మలను కలాలుగా తయారుచేసారు. సరస్వతీదేవి వ్రాయడం మొదలెట్టారు. 

వేల సంవత్సరములు గడిచాయి. విష్ణువు అటుగా వచ్చి వేల సంవత్సరాలుగా వ్రాస్తున్నారు, ఎంతవరకూ వచ్చింది వ్రాయడం అని అడిగితే " ఆయన కాలిగోరు వర్ణన అయింది ఇప్పటికి " అన్నారుట సరస్వతీదేవి.

రాధాదేవి శక్తిస్వరూపిణి. అమ్మవారు, గోలోకానికి ఈశ్వరి. విష్ణువు యొక్క ప్రేమ/ఆనంద స్వరూపిణి. బ్రహ్మ 6000 సంవత్సరాలు ( ఆయన సం.లు - కొందరు 60 వేల సం.లు అని భాష్యం చెప్పారు ) తపస్సు చేస్తే రాధాదేవి కాలిగోరు మాత్రం దర్శనం అయిందిట ఆయనకు. 

అందుకే పాదసేవ ఉత్తమం. గోరును దర్శించుకుని అనుగ్రహం పొందవచ్చు.

" కాలిగోటికి సరిపోవు " అనే‌ మాటను తరచూ వింటూంటాం. ఈ గోరుకు పురాణాలలో ఇంత పెద్ద కధ ఉంది. 

ఇతర మతాలు మన సనాతనధర్మం " కాలి చిటికినవ్రేలి గోటికి " కూడా సరిపోవు అని భావించడంలో తప్పు లేదు అని ఎవరయినా అనుకుంటే నేరం వారిది కాదు అని అనుకోవచ్చా.

ఏతత్ సర్వం శ్రీపరదేవతార్పణమస్తు - సూర్య.

శుభం భూయాత్

Comments

Popular posts from this blog

సీతమ్మతల్లికి సాటి ఎవరు? - చీమలపాటి సూర్యనారాయణ

అన్నదానం వల్ల ఎవరెవరికి పుణ్యం వస్తుంది - చీమలపాటి సూర్యనారాయణ

శ్రీసరస్వతీ దేవి పుట్టినరోజు నేడు,, శుభాకాంక్షలు అందరికీ - చీమలపాటి సూర్యనారాయణ