శ్రీగీతాజయంతి నేడు - శుభాకాంక్షలు - చీమలపాటి సూర్యనారాయణ

 🙏" శ్రీరస్తు శుభమస్తు "🙏

ఈ రోజు మార్గశిరశుక్లఏకాదశి. గీతా జయంతి. పరమాత్మ అద్భుతము, సాటిలేని గీతని లోకానికి/ప్రపంచానికి ప్రసాదించి అనుగ్రహించిన రోజు.

" విభూతియోగం " లో తన విభూతులను తెలియచేస్తూ స్వామి " మాసానాం మార్గశీర్షో2హం ( 10:35 ) - మాసాల్లో మార్గశిరమాసాన్ని నేను " అన్నారు.

అలాగే " మహర్షీణాం భృగురహం ( 10.25 ) - మహర్షుల్లో భృగువును నేను " అన్నారు.

ఈ భృగువు ఎవరు?. ఈయన సప్తఋషుల్లో ఒకరు. బ్రహ్మ మానసపుత్రుడు. ఈయన " భృగుసంహిత " ని రచించారు. జ్యోతిషశాస్త్రానికి ఆద్యుడు. లక్ష్మీదేవిని కూతురుగా పొందారు. ఈయన కుమారుడే చ్యవనమహర్షి.

మహాభారతంలోని శాంతిపర్వంలో భృగుమహర్షి-భరద్వాజమహర్షిల సంవాదం ఉంటుంది. దానిలో వృక్షాలగురించి విస్తృతంగా చర్చించి ఎంతో అద్భుత సమాచారాన్ని లోకానికి తెలియచేసారు. వృక్షాలకి ప్రాణం, స్పర్శ, స్పందనలు ఉంటాయని, దర్శనశక్తి, వినేశక్తి కూడా ఉంటాయని మనకు తెలియచేసారు. 5000 ల సంవత్సరాలక్రితం ఋషులు చెప్పిన ఈ విషయాలను మొన్న మన " జగదీష్ చంద్రబోస్ " గారు నిజమేనని నిరూపించి మన ఋషుల జ్ఞానాన్ని, మన సనాతనధర్మం గొప్పదనాన్ని ఇంకోసారి ప్రపంచానికి తెలియచేసారు.

ఇప్పుడు వృక్షాలని పడగొట్టడం ఇష్టంలేక దాన్ని అలాగే ఇంకోచోటికి తరలించి నాటుతూ ఉంటే ఆశ్చర్యంగా అనిపిస్తూంది, ఎలా బ్రతుకుతూందీ అని. 5000 ల సంవత్సరాలక్రితమే పారిజాతవృక్షాన్ని కృష్ణుడు దేవలోకం నుంచి తీసుకొని వచ్చి సత్యభామ ఇంటిపెరట్లో ప్రాతిన విషయం అందరికీ తెలిసినదే.

సోమరితనం, నపుంసకత్వం వదిలేయి, హృదయదౌర్బల్యం నీచాతినీచం ( 2:3 ) అన్నారు.

నామాయనుంచి తప్పించుకోవడం మహామహులకు కూడా సాధ్యంకాదు ( 7:14 ) అని చెబుతూనే వైరాగ్యంతో కూడిన అభ్యాసంతో నన్ను పొందడం కష్టంకాదు అన్నారు. క్షణం కూడా పనిచెయ్యకుండా కూర్చోకు ( 3:15 ), కూర్చోలేవు కూడా అన్నారు. అందుకే కర్మలు చేస్తూ ఉండు, ఫలితాన్ని గురించి పట్టించుకుని బాధపడకు అన్నారు.

అన్ని విషయాలు చెప్పిన పరమాత్మ చివరికి అన్నారు :

" ఇతితేజ్ఞానమాఖ్యాతం 

  గుహ్యతే గుహ్యతరం మయా , 

  విమృశ్యైతదశేషేణ 

  యధేచ్ఛసి తధాకురు " 

              - భ.గీత 18:63 

అంటే " నేను నీకు చెప్పవలసిన రహస్యజ్ఞానమంతా చెప్పాను. ఏదో నేను చెప్పానని కాకుండా దీన్ని సమగ్రంగా నీ బుద్ధితో విమర్శచేసుకుని నీకు తోచిన/నచ్చిన విధంగా ఆచరించు " అన్నారు పరమాత్మ.

ఎంత అద్భుతంగా తెలియచేసారు, ఏదీ తనమీద పెట్టుకోరు. అందుకే " గీత " 5000 ల సంవత్సరాలుగా నిత్యనూతనంగా వెలుగుతూంది. ఇంకో 5000 సంవత్సరాలు గడిచినా దీని విలువ ఏమాత్రం తగ్గదు సరికదా పెరుగుతుంది అనడంలో సందేహమే లేదు.

గీతా జయంతి శుభాకాంక్షలు అందరికీ.

ఏతత్ సర్వం శ్రీశ్రీకృష్ణార్పణమస్తు - సూర్య. 

శుభం భూయాత్

Comments

Popular posts from this blog

సీతమ్మతల్లికి సాటి ఎవరు? - చీమలపాటి సూర్యనారాయణ

అన్నదానం వల్ల ఎవరెవరికి పుణ్యం వస్తుంది - చీమలపాటి సూర్యనారాయణ

శ్రీసరస్వతీ దేవి పుట్టినరోజు నేడు,, శుభాకాంక్షలు అందరికీ - చీమలపాటి సూర్యనారాయణ