హనుమద్వ్రతం నేడు, శుభదినం - చీమలపాటి సూర్యనారాయణ
🙏"శ్రీరస్తు శుభమస్తు"🙏
" అంజనా నందనం
వీరం జానకి శోకనాశనం,
కపీశమక్షహంతారం
వందే లంకా భయంకరం "
" యత్రయత్ర రఘునాధకీర్తనం
తత్రతత్ర కృతమస్తకాంజలిం,
భాష్పవారి పరిపూర్ణలోచనం
మారుతిం నమత రాక్షసాంతకం "
మొదటి శ్లోకం లో సీత శోకాన్ని పోగొట్టిన అరివీరభయంకరుడు. రెండవ శ్లోకంలో తలవంచుకుని చేతులు కట్టుకుని కళ్ళనిండుగా నీళ్ళతో నుంచుని ఉన్న హనుమ. ఎక్కడ రామకీర్తన జరుగుతూన్నా హనుమ అక్కడ అలా నుంచుని ఉంటాడు. ఎంత తేడా. భక్తికి పరాకాష్ఠ. అందుకే " భక్తానాం అగ్రగణ్యం " అని కీర్తింపబడ్డాడు.
లంకకు నిప్పుపెట్టేసాక హనుమ సముద్రపు ఒడ్డుకు చేరుకుంటాడు. అయ్యో ఎంతపని చేసాను, కోపం ఎంత చెడ్డది, మనిషి విచక్షణజ్ఞానాన్ని నశింపచేస్తుంది కదా, రావణుడిమీద కోపంతో అలా అంటించేయడమేమిటి, ఇప్పుడు సీతమ్మ పరిస్థితి ఏమిటి. ఆమె కూడా అగ్నికి ఆహుతి అవుతే రామలక్ష్మణులు సుగ్రీవుడు వానరవీరుల పరిస్థితి ఏమిటి, అందరూ ప్రాణాలు విడుస్తారు కదా " అని బాధపడతాడు. వెంటనే అనుకుంటాడు " నన్నే అగ్నిదేవుడు బాధపెట్టలేదు, ఇంక మహాసాధ్వి సీతమ్మని ఎలా బాధపెడతాడు " అని సర్దిచెప్పుకుంటాడు.
" నాగ్నిః అగ్నౌ ప్రవర్తతే " - అగ్నిని అగ్ని ఏమి చేయగలదమ్మా , నా అమాయకత్వం కాకపోతే అని కూడా అంటారు హనుమ సీతతో. హనుమకు తెలియదు సీతమ్మ హనుమను బాధపెట్టవద్దని అగ్నిని ప్రార్ధించినట్లుగా.
కోపం మనిషికి ఎంత అనర్ధహేతువో తెలియచేసారు హనుమ. వినయం ఎంతటి ఉన్నతిని కలుగచేస్తుందో తెలుసుకోవడానికే హనుమే నిదర్శనం.
రాముడు " జగదానందకారకుడు " - జగత్తుకంతకూ ఆనందాన్ని కలిగించేవారు. ఆశ్చర్యకరం ఏమిటంటే అటువంటి రాముడికి సీతమ్మ జాడ తెలియచేసి ఆనందాన్ని కలుగచేసారు హనుమ.
అందుకే హనుమని తలుచుకుంటే చాలు, వారికి అష్టసిద్ధులు, నవనిధులు లభిస్తాయని సీతమ్మ హనుమకు వరం ఇచ్చింది.
ఈరోజు హనుమద్వ్రతం చేసుకుంటాం. శుభదినం.
అందరికీ ఆరోగ్యాన్ని, అభయాన్ని, ఇంద్రియనిగ్రహంని, భక్తిని ప్రసాదించమని హనుమను కోరుకుందాం.
ఏతత్ సర్వం శ్రీహనుమదార్పణమస్తు - సూర్య.
శుభం భూయాత్
Comments
Post a Comment