అమ్మవారి కనురెప్పపాటులో సృష్టి లయం రెండూ జరిగిపోతున్నాయి - చీమలపాటి సూర్యనారాయణ
🙏"శ్రీమాత్రేనమః"🙏
"ఉన్మేషనిమిషోత్పన్నవిపన్నభువనావళిః " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 281 వ నామం.
"ఉన్మేషనిమిషోత్పన్నవిపన్నభువనావళిః " అంటే అమ్మవారు కన్ను తెరవగానే సృష్టి, కన్ను మూయగానే లయం జరుగుతూంది అని భాష్యం చెప్పారు. రెప్పపాటులో సృష్టి, లయ రెండూ అయిపోతున్నాయి.
రెప్పపాటు అన్నది ఒక వృత్తం, ఒక కార్యక్రమం. దీన్ని ఆవర్తనం అంటారు. మనకు తెలిసిన అతి చిన్న ఆవర్తనం రెప్పపాటు. ఇలాంటివే పగలు రాత్రి, శుక్ల పక్షం కృష్ణ పక్షం, ఉత్తరాయణం దక్షిణాయణం, ఉదయ కల్పం క్షయ కల్పం.
ఈ ఆవర్తనం శృతి అంటే వేద లక్షణము. లయ. సృష్టిలో లయను ఋషులు దర్శించారు. ఈ లయ లక్షణం తల్లిదండ్రుల వంటిది. జ్యోతిషం చంద్రుడు సూర్యులను తల్లిదండ్రులుగా భావిస్తుంది. సూర్యచంద్రులు అమ్మవారి కన్నులు. సూర్యచంద్రులు 15 రోజులకు ఒకసారి దగ్గరకు వస్తారు, మళ్ళీ 15 రోజులకు దూరంగా వెడుతూంటారు. దగ్గరకు వస్తే అమావాస్య, దూరంగా వెడితే పౌర్ణమి. భూమి సూర్యుని చుట్టూ తిరగడానికి 365 రోజులు పడుతుంది. ఈ మానవ సంవత్సర కాలంలో సూర్యుడు చంద్రుడు 12 సార్లు దగ్గరకు వచ్చి మళ్ళీ 12 సార్లు దూరంకు వెడతారు. ఇది ఒక ఆవర్తనం. 24 సంఖ్యను సూచించేవే సూర్యమండలవాసి అయిన అమ్మవారు గాయత్రీదేవి మంత్రాక్షరాలు.
ఎంత అద్భుతం మన ఋషుల విజ్ఞానం, మన వాజ్మయం. ఖగోళాన్ని కాచి వడపోసేసారు.
అమ్మవారు మాయాప్రకృతి. సృష్టి అంతా అమ్మవారే.
ఏతత్ సర్వం శ్రీపరదేవతార్పణమస్తు - సూర్య.
శుభం భూయాత్
Comments
Post a Comment