అమ్మవారు తనను ఆశ్రయించిన భక్తులకు కీర్తిని ప్రసాదిస్తారు - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏

" యశస్వినీ " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 474 వ నామం .

" యశస్వినీ " అంటే గొప్ప కీర్తిగలది అని భాష్యం చెప్పారు. కీర్తి ఎవరికి దక్కుతుంది. సమాజానికి ఉపయోగపడే అద్భుతమయిన పనులు చేసినవారికి. అమ్మవారికన్నా సమాజానికి ఉపయోగపడే అద్భుతమయిన పనులు చేసేవారు ఎవరు ఉంటారు. 

జీవులందరికీ చక్కటి ఆహారం, రకరకాల పూలు పళ్ళు, మనస్సుకు ఆహ్లాదాన్ని కలిగించే సెలయేళ్ళు, కొండలు, తరించడానికి సాధనలకు అనుకూలమయిన ప్రశాంతమయిన ప్రదేశాలతో బాటు సుఖజీవనానికి కావలసిన ఏర్పాట్లు అన్నీ చేసారు అమ్మవారు. మనం ఆ ఏర్పాట్లను పాడుచేసుకోకుండా అమ్మవారికి సదా కృతజ్ఞులుగా ఉండాలి.

ఆదిశంకరులు దేవీ అపరాధ క్షమాస్తోత్రం చేస్తూ ఇలా ప్రార్థిస్తారు:

" చితాభస్మాలేపో గరళమశనం 

  దిక్పటధరో జటాధారీ కంఠే 

  భుజగపతిహారీ పశుపతిః

  కపాలీ భూతేశో భజతి 

  జగదీశైక పదవీం భవానీ త్వత్పాణిగ్రహణ

  పరిపాటీ ఫలమిదమ్ "

" ఓ తల్లీ, చితాభస్మం వంటికి పూసుకునేవాడు, విషాన్ని ఆహారంగా సేవించేవాడు, దిక్కులను దుస్తులుగా ధరించేవాడు, జడలు కట్టిన జుట్టు గలవాడు, కంఠంలో పాములను ధరించేవాడు, కపాలం చేతిలో గలవాడు, భూతనాయకుడు ఇన్ని అవలక్షణాలు ఉన్న శంకరుడిని జగదీశ్వరుడు అని ఎందుకు కొలుస్తున్నామో తెలుసా. నిన్ను వివాహం చేసుకోవడం వలన ఆయనకా ఫలం వచ్చింది " అని ప్రార్థించారు శంకరులు.

ఎవరయినా ఏమి ఇవ్వగలరు, వారి వద్ద పుష్కలంగా ఉన్నదే కదా. అమ్మవారు జీవులకు ఇవ్వడానికి కావలసినంత కీర్తి కలిగి ఉంది.

అమ్మవారు తనను నమ్ముకున్నవారికే కాకుండా తనను కట్టుకున్నవానికి కూడా పేరుప్రఖ్యాతులు తెచ్చేటంత కీర్తిని గడించారు.

ఏతత్ సర్వం శ్రీపరదేవతార్పణమస్తు - సూర్య.

శుభం భూయాత్

Comments

Popular posts from this blog

సీతమ్మతల్లికి సాటి ఎవరు? - చీమలపాటి సూర్యనారాయణ

అన్నదానం వల్ల ఎవరెవరికి పుణ్యం వస్తుంది - చీమలపాటి సూర్యనారాయణ

శ్రీసరస్వతీ దేవి పుట్టినరోజు నేడు,, శుభాకాంక్షలు అందరికీ - చీమలపాటి సూర్యనారాయణ