కరోనా వంటి వ్యాధులు ప్రబలినప్పుడు మాత్రం మన ఆచారాలే దిక్కవుతాయి - చీమలపాటి సూర్యనారాయణ
🙏"శ్రీమాత్రేనమః"🙏
" సదాచారప్రవర్తికా " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 356 వ నామం.
" సదాచారప్రవర్తికా " అంటే సదాచారాలను ప్రవర్తింపచేస్తారు, ఆచరింపబడేలా చూస్తారు అమ్మవారు. ఆచరణలో పెట్టబడేవన్నీ ఆచారాలే. అవి సదాచారాలు కావచ్చు, దురాచారాలు కావచ్చు. సదాచారాలను ప్రోత్సహిస్తారు, దురాచారాలను అడ్డుకుంటారు అమ్మవారు.
కొన్ని సదాచారాలు కూడా కొందరికి దురాచారాలుగా కనబడి దూషిస్తూ ఉంటారు. ఆ ఆచారాలను సరిగ్గా అర్ధం చేసుకోకపోవడమే దానికి కారణం.
సనాతనధర్మం ఎన్నో సదాచారాలను తెలియచేసింది. అవన్నీ శరీరారోగ్యానికి, సమాజ శ్రేయస్సుకు పనికొచ్చేవే. అవేమీ మతానికి సంబంధించినవి కావు. కాని మతరంగు పులిమి వాటిని పాటించకుండా చేస్తున్నారు కొందరు. ప్రస్తుతపు సమాజ/ప్రపంచ అశాంతికి సదాచారాలను పాటించకపోవడం, దురాచారాలను పాటించడమే ముఖ్యకారణం.
కరోనా వంటి వ్యాధులు ప్రబలినప్పుడు మాత్రం మన ఆచారాలే దిక్కవుతాయి.
తను పాటించే ఆచారం వలన తనకు, సమాజానికి మంచి జరిగితే ఆ ఆచారం సదాచారం. ఎవరికయినా అసౌకర్యాన్ని, చెడును కలిగిస్తే అది దురాచారం.
పరమాత్మ గీతలో ఇలా తెలియచేసారు:
" యద్యదాచరతి శ్రేష్ఠః
తత్తదేవేతరో జనః
స యత్ప్రమాణం కురుతే
లోకస్తదనువర్తతే "
- భ.గీత 3:21
" మహనీయుడయిన వ్యక్తి ఎట్టి కార్యములను చేయునో వానిని సామాన్యజనులు అనుసరింతురు. తన ఆదర్శప్రాయ కర్మము ద్వారా దేనిని అతడు ప్రమాణముగా నిర్ణయించునో దానినే లోకమంతయు అనుసరించును " అని తెలియచేసారు పరమాత్మ.
" ఆచరతి ఆచారయతి ఇతి ఆచార్యః " - తాను ఆచరిస్తూ ఆచరింపచేసేవారిని ఆచార్యులు అంది శాస్త్రం. ఆదిశంకరులు, కంచి పరమాచార్య, రమణమహర్షి, రామకృష్ణ పరమహంస వంటి వారు ఆచార్యులు.
సదాచారప్రవర్తనకు అవసరమయినప్పుడల్లా ఆచార్యులను పంపిస్తూ ఉంటారు అమ్మవారు.
ఏతత్ సర్వం శ్రీపరదేవతార్పణమస్తు - సూర్య.
శుభం భూయాత్
Comments
Post a Comment