అమ్మవారి ఆభరణాల ధ్వనులు మన దుఃఖాన్ని పోగొడుతాయి - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏

" సర్వాభరణ భూషితా " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 51 వ నామం. 

" సర్వాభరణ భూషితా " అంటే సమస్తమైన నగలతో అలంకరింపబడినట్టిది అని భాష్యం చెప్పారు. కల్పసూత్రమందు అమ్మవారికి 40 రకాల ఆభరణాలు చెప్పారు. కాళికాపురాణమందు శిరోభూషణమునుండి కాలి చుట్లవరకూ ఆభరణములను వర్ణించారు.

గాయత్రీదేవి ధ్యానశ్లోకంలో " ఇందు నిబద్ధ రత్నమకుటాం " అని ప్రార్థిస్తాం. చంద్రకళతో కూడిన కిరీటం ధరించారు అమ్మవారు అని.

శ్రీసూక్తంలో అమ్మవారిని " హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజాం " అని స్తుతిస్తాం. సువర్ణరజతస్రజాం అంటే బంగారు వెండి ఆభరణాలు ధరించిన అమ్మవారు అని.

సూర్యదేవుని స్తుతిస్తూ " కేయూరవాన్ మకరకుండలవాన్ కిరీటీ హారీ వపుద్ధృత శంఖ చక్రః " అని కీర్తిస్తాం. కేయూరం, మకర కుండలాలు, కిరీటం, హారాలను ధరించిన స్వామి అని. 

దేవతలు రకరకాల ఆభరణాలు ధరించి దర్శనమిస్తారు. ఆభరణాలు ధరించి మెరిసిపోతూన్న అమ్మవారిని చూస్తే మన మనస్సు పులకరిస్తుంది.

రుక్మిణిని తీసుకుని వెళ్ళడానికి కృష్ణుడు విదర్భకు వస్తారు. రుక్మిణి గౌరీ పూజ అనంతరం గుడి బయటకు వస్తూన్నప్పుడు పోతనగారు ఆమె ఆభరణాలను ఇలా వర్ణిస్తారు:

" సువర్ణమేఖలాఘటిత మణి కిరణపటలంబు లకాల శక్రచాప జనకంబులై మెఱయఁ - బంగారపు వడ్డాణం లోని రత్నాల కాంతులు అకాల ఇంద్రధనుస్సు మెరుపులు పుట్టిస్తున్నాయి ", " శింజాన మంజు మంజీర నినదంబులు చెవుల పండువులు సేయఁ - మోగుతున్న కాలిగజ్జెల మనోఙ్ఞమైన గలగలలు చెవులకు పండుగ చేస్తున్నాయి " అని. ఎంత అద్భుతంగా ఉంది. అమ్మవారి కాలిగజ్జెల సవ్వడి అమంగళాలను, దరిద్రాన్ని పోగొడుతుంది. అదీ ఆభరణాల శక్తి.

" నిండుగ కరముల బంగరు గాజులు
   ముద్దులొలుకు పాదమ్ముల  మువ్వలు 
   గల గల గలమని సవ్వడి చేయగా
   సౌభాగ్య వతుల సేవలు నందగా

  సౌభాగ్య లక్ష్మి రావమ్మా అమ్మా.....
  సౌభాగ్య లక్ష్మి రావమ్మా " అని కీర్తించారు పురందరదాసు. 

స్త్రీలకు రకరకాల ఆభరణాలు. ఒక్క శిరస్సుపైనే 10 రకాల ఆభరణాలు చూస్తూంటాం. మెడలో అయితే లెక్కలేనన్ని ఆభరణాలు. వీటిలో మంగళకరమయినవి నిత్యం ధరించేవీ కూడా ఉంటాయి. మంగళసూత్రం, నల్లపూసలు, చుట్లు, మట్టెలు మొదలగునవి.

స్వామి కుండలాలు, అమ్మవారు తాటంకాలు ధరిస్తారు. దక్షిణామూర్తికి కుడిచెవికి కుండలం, ఎడమచెవికి తాటంకం ఉంటాయి. అర్ధనారీశ్వరం.

ఆశ్చర్యకరంగా నారాయణతీర్థులు " గోవర్ధన గిరిధర " తరంగంలో " నాట్యరసోత్కట నానాభరణా " అని, " శ్రీవత్సాంకిత శ్రీకౌస్తుభధర " అని కీర్తించారు. రకరకాల ఆభరణాలు ధరించారుట కృష్ణుడు.

రాసలీలలో కృష్ణుడు చేతులను అటూ ఇటూ త్రిప్పుతూ నాట్యం చేస్తూంటే ఆయన మెడలోని ఆభరణాలు కూడా ఇటూ అటూ ఊగిపోతున్నాయిట. అలా ఊగడం వలన అవి చిక్కులు కూడా పడుతున్నాయని వర్ణించారు భాగవతంలో. ఊహించుకుంటే ఎంత అద్భుతంగా ఉంటుందో.

ఈరోజు నుంచి శ్రీశ్యామలాదేవి నవరాత్రులు. శుభాకాంక్షలు అందరికీ.

ఏతత్ సర్వం శ్రీపరదేవతార్పణమస్తు - సూర్య.

శుభం భూయాత్

Comments

Popular posts from this blog

సీతమ్మతల్లికి సాటి ఎవరు? - చీమలపాటి సూర్యనారాయణ

అన్నదానం వల్ల ఎవరెవరికి పుణ్యం వస్తుంది - చీమలపాటి సూర్యనారాయణ

శ్రీసరస్వతీ దేవి పుట్టినరోజు నేడు,, శుభాకాంక్షలు అందరికీ - చీమలపాటి సూర్యనారాయణ