అమ్మవారికి ఇష్టమయినవారు, అయిష్టమయినవారు అని తేడా ఉండదు - చీమలపాటి సూర్యనారాయణ
🙏"శ్రీమాత్రేనమః"🙏
" నిష్పరిగ్రహా " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 183 వ నామం .
" నిష్పరిగ్రహా " అంటే పరిజనులు లేనిది అని భాష్యం చెప్పారు. అంటే బంధువులు కావలసినవారు లేరని.
అమ్మవారికి ఇష్టులూ ఉండరు, అయిష్టులూ ఉండరు. కావలసినవారు, అక్కర్లేనివారు అనే తేడా ఉండదు అమ్మవారికి. అందరూ అమ్మవారి సృష్టియే, బిడ్డలే. త్రిగుణాల ప్రభావం వలన బంధాలు ఏర్పడతాయి. అమ్మవారు త్రిగుణాలకు అతీతులు, తురీయస్థితి.
భాగవతంలో వ్యాసర్షి ఓ అద్భుత విషయం వ్రాసారు. రాసలీలకు ముందు " భగవానుడు అయినప్పటికీ ( అంటే తనవారు పరాయివారు అనే తేడాలేనప్పటికీ ) గోపికలను అనుగ్రహించడానికి నిశ్చయించారు " అని.
శ్రీసూక్తంలో " ఆపః సృజంతు స్నిగ్ధాని చిక్లీత వస మే గృహే " అని ప్రార్ధిస్తాం. నీరు, మంచి ఆహారం ఉత్పాదన చేస్తూ చిక్లీతుడు మా ఇంట్లో నివసించుగాక అని. చిక్లీతుడు లక్ష్మీదేవి కుమారుడు. బిడ్డ ఎక్కడుంటే తల్లి అక్కడ ఉంటుంది కనుక చిక్లీతుడు మన ఇంట్లో ఉంటే లక్ష్మీదేవి కూడా మన ఇంట్లోనే ఉండిపోతుందనే ఆశ తో అలా ప్రార్ధిస్తాం. కాని అమ్మవారికి బంధాలేమిటి?. మన అమాయకత్వం కాకపోతే.
బంధువులు, కావలసినవారిని ఒకలా చూస్తాం. ఇతరులను ఇంకొకలా చూస్తాం మనం. అది మానవనైజం.
బృహదారణ్యకోపనిషత్తులో యాజ్ఞవల్క్యమహర్షి తన భార్య మైత్రేయితో " ఆత్మనస్తు కామాయ సర్వం ప్రియం భవతు " - మనదనుకొన్న కోరికలు అన్నీ ఇష్టమవుతాయి మనుషులకు " అని చెబుతారు. మానవనైజం , బంధాల గురించి ఎన్నో అద్భుత విషయాలు తెలియచేశారు. ఉదా: పిల్లవాడు మనవాడయితేనే ప్రియం. ఆవులాంటి జంతువులు మనవయితేనే ప్రియం.
కుక్క ఒకటే కాని మనదయితే ఆప్యాయంగా ప్రేమగా చూస్తాం, సేవలు కూడా చేస్తాం. వేరే వాళ్ళదయితే " ఛీ ఛీ " అని కర్ర పట్టుకుని తరుముతాం. మనదీ అని ఒక బంధం, మనకు ఉపయోగపడుతుంది అనే కోరిక. అహం ( నేను ), మమ ( నాది ) అన్నవి చాలా చెడ్డవి. ఈ బంధాలు చాలా చెడ్డపనులు కూడా చేయిస్తాయి.
అమ్మవారు " పద్మపత్రమివాంభసా " - తామరాకు మీద నీటిబొట్టులా ఉంటారు. ఎవరితోనూ బంధాలు ఉండవు, జీవుల కర్మఫలాలు అమ్మవారికి అంటవు.
ఏతత్ సర్వం శ్రీపరదేవతార్పణమస్తు - సూర్య.
శుభం భూయాత్
Comments
Post a Comment