అమ్మవారు అద్భుత సౌందర్యవతి - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏

" అనాకలితసాదృశ్య చుబుకశ్రీవిరాజితా " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 29 వ నామం.

" అనాకలితసాదృశ్య చుబుకశ్రీవిరాజితా " అంటే సాటిలేని సొగసుగల చుబుకం/గడ్డంతో ప్రకాశించుచున్నది అని భాష్యం చెప్పారు.

ముఖానికి అద్భుత సౌందర్యంని ఇచ్చేది చుబుకమే. చిన్న పిల్లలని ముద్దు చేసేటపుడు చుబుకాన్ని పట్టుకుంటారు. 

చిన్నపిల్లలను ఆత్మీయులను ఏదయినా విషయంలో నచ్చచెప్పే ప్రయత్నం చేసేటప్పుడు చుబుకం/గడ్డం పట్టుకుంటారు.

శంకరులు సౌందర్యలహరి గానంచేస్తూ అమ్మవారి చుబుకం మీద అద్భుతమయిన శ్లోకం చెప్పారు: 

" కరాగ్రేణ స్పృష్టం తుహినగిరిణా 

  వత్సలతయా గిరీశేనోదస్తం 

  ముహురధరపానాకులతయా,

  కరగ్రాహ్యం శంభోర్ముఖముకురవృన్తం 

  గిరిసుతే కథంకారం  బ్రూమస్తవ

  చుబుకమౌపమ్యరహితమ్ "     

                        - 67

ఓ పార్వతీదేవీ! ఉపమానరహితమైన నీ చుబుకమును(గడ్డమును) మేమెలా వర్ణించగలము? దానిని నీ తండ్రి అయిన హిమాచలుడు వాత్సల్యప్రేమతో తన వ్రేళ్ళతో నిమిరాడు. గిరీశుడు అధరామృతపానంచేయడానికి మాటిమాటికీ పైకి ఎత్తినాడు. సరిపోల్చదగినది ఏమీలేనిది అయిన నీ ముఖము అను అద్దమును పుచ్చుకొనుటకు అందమైన పిడివలె నున్న నీ ముద్దులొలుకు చుబుకమును ఏ విధముగా వర్ణించగలను?

కృష్ణుడు మథుర వీధిలో వెడుతూ ఓ స్త్రీని చూసి " సుందరీ, ఎవరు నువ్వు " అని అడగ్గానే ఆవిడ సిగ్గు పడి " దాస్యస్మ్యహం - దాసిని నేను. అందంగా ఎలా ఉంటాను " అంటుంది. ఆవిడ కుబ్జ. ఆవిడకు గూనె. పేరు త్రివక్ర. మూడు వంకరలు తిరిగి ఉంది ఆవిడ శరీరం. కంసుడికి సుగంధద్రవ్యాలతో తయారుచేసిన లేపనాలు ( వంటికి రాసుకునేవి ) తీసుకెడుతూంది. కృష్ణుడిని చూసి నేను తయారుచేసిన ఈ లేపనం ఈ సుందరుడు రాసుకుంటే ఎంత బాగుండును అనుకుంటుంది మనస్సులో.

పరమాత్మ ఆ లేపనం కొద్దిగా తీసుకుని తన శరీరానికి రాసుకుని, బాగుంది అని, ఆవిడ చుబుకాన్ని తన కుడిచేయి మధ్యవ్రేళ్ళతో ప్రేమగా అలా పైకి ఎత్తారు. అంతే ఆవిడ నిటారుగా, సుందరంగా అయిపోయింది. పులకించి పోయి కన్నీళ్ళతో కృష్ణుడి పాదాలపై పడింది. 

ప్రేమ, అభిమానాన్ని చాటడానికి చుబుకాన్ని పట్టుకుంటారు. 

ఏతత్ సర్వం శ్రీపరదేవతార్పణమస్తు - సూర్య.

శుభం భూయాత్

Comments

Popular posts from this blog

సీతమ్మతల్లికి సాటి ఎవరు? - చీమలపాటి సూర్యనారాయణ

అన్నదానం వల్ల ఎవరెవరికి పుణ్యం వస్తుంది - చీమలపాటి సూర్యనారాయణ

శ్రీసరస్వతీ దేవి పుట్టినరోజు నేడు,, శుభాకాంక్షలు అందరికీ - చీమలపాటి సూర్యనారాయణ