శరణాగతి అంటే చాలు అమ్మవారు ఎలా పూజించినా ముక్తిని ఇస్తారు - చీమలపాటి సూర్యనారాయణ
🙏"శ్రీమాత్రేనమః"🙏
" ముక్తిరూపిణీ " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 737 వ నామం .
" ముక్తిరూపిణీ " అంటె మోక్షమే స్వరూపముగా గలది. అమ్మవారు అమృతమూర్తి. చూపులతో అమృతాన్ని కురిపిస్తారు. జీవుడు అర్ధకామాలనే కోరుకున్నా అవి ధర్మబద్ధమవుతే అమ్మవారు మోక్షాన్ని కూడా అనుగ్రహిస్తారు. ఎవరికి ఎలా మోక్షం ఇద్దామా అని ఆలోచనచేస్తూ అవకాశాలను ఇస్తూ ఉంటారు. ఆ అవకాశాలను సద్వినియోగం చేసుకునేవారు మోక్షం పొందుతారు.
నేరుగా అమృతం త్రాగిన బ్రహ్మాది దేవతలు మళ్ళీ జన్మ తీసుకోవలసిరావచ్చేమో కాని అమ్మవారి అమృతాన్ని పొందినవారు మోక్షం, జన్మరాహిత్యం పొందుతారు.
అరుణోపనిషత్తునందు " నా శరీరమునంతను అమృతమునందుంచుము. 72 వేల నాడులను తడుపుము. నన్ను విశ్వమునందు పుట్టినవానిగా ఎరుంగుము " అని ప్రార్థిస్తాం పరమేశ్వరుడిని.
భాగవతమునందు ఓ అద్భుత ఘట్టం ఉంది. కృష్ణుడు గోపబాలురతో దూడలను త్రోలుకుంటూ యమున వడ్డుకు వెడతారు. దాహంతో కొందరు బాలురు అక్కడ మడుగులో దిగి నీరు త్రాగి చనిపోతారు. ఆ మడుగులో కాళీయుడు అనే సర్పరాజు ఉండడంవల్ల నీరు విషపూరితం అయిపోయింది.
పోతనగారు అద్భుత పద్యం వ్రాసారు:
" కాళిందిలో విషకలిత తోయము....
.........ఈక్షణామృతధార లైలమి గురిసి "
ఈక్షణ+అమృతధారల+ఎలమిన్+కురిసి - ప్రేమతో అమృతధారలు కురిసే చూపులతో చనిపోయిన గోపబాలురను అందర్నీ బ్రతికించారుట కృష్ణుడు. అంతమంది గోపబాలకులు చనిపోవడం చూసిన కృష్ణుడి కళ్ళవెంట అమృతధారలు కురిసాయిట. ఎంత అద్భుతం.
తనను నమ్ముకున్న వారు అంటే ఎంత అభిమానమో, ప్రేమో.
అజ్ఞానంతో అశాస్త్రీయంగా సేవించినా శరణాగతి అంటే చాలు మోక్షాన్ని అనుగ్రహిస్తారు అమ్మవారు. అవ్యాజకరుణామూర్తి.
ఏతత్ సర్వం శ్రీపరదేవతార్పణమస్తు - సూర్య.
శుభం భూయాత్
Comments
Post a Comment