మనస్సు శుద్ధి అవుతే సమాజంలో శాంతి, సుఖం వెల్లివిరుస్తాయి - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏

" శుద్ధా " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 765 వ నామం. 

" శుద్ధా " అంటే పరిశుద్ధమయినది, అవిద్యచే కలిగిన మాలిన్యములు లేనిది. అవిద్య అంటే అజ్ఞానం. అజ్ఞానం వలన కామక్రోధలోభాల వంటి దోషాలు/మాలిన్యాలు అలవడుతాయి. అమ్మవారు ఇవేవీ లేకుండా శుద్ధంగా ఉంటారు.

శుచి వేరు, శుద్ధి వేరు. శుచి అంటే మామూలుగా శుభ్రపరచుకోవడం. రోజూ చేసుకునేది. శుద్ధి అంటే మంత్రపూర్వకంగా శుభ్రపరచుకోవడం. అశౌచాలు ఏర్పడినప్పుడు శుద్ధి చేసుకుంటారు. 

శుద్ధి గురించి మహాభాగవతంలో వ్యాసర్షి ఇలా తెలియచేసారు:

" కాలేన స్నానశౌచాభ్యాం 

  సంస్కారైస్తపసేజ్యయా,

  శుధ్యంతి దానైః సంతుష్ట్యా 

  ద్రవ్యాణ్యాత్మాఽఽత్మవిద్యయా "

          - మహాభాగవతం 10:05:04

మానవుడు సకాలంలో చేయవలసిన కార్యాలు చేస్తే శుద్ధుడవుతాడు అంది శాస్త్రం.

స్నానం, శౌచం అంటే సదాచారంతో దేహం శుద్ధమవుతుంది. ఉతకడం వలన వస్త్రం, దున్నడం వలన భూమి, చెక్కడం వలన కర్ర, గర్భాదానాది సంస్కారములచేత గర్భం, తపస్సు చేత ఇంద్రియములు, యాగముచేత బ్రాహ్మణుడు, దానంచేత ధనం, సంతోషంచేత మనస్సు, ఆత్మవిద్యచేత జీవుడు శుద్ధి అవుతారు అని తెలియచేస్తూంది మహాభాగవతం.

ఇక్కడ ఓ ముఖ్యమయిన విషయం చెప్పారు. సంతోషంవలన మనస్సు శుద్ధమవుతుంది అని. సంతోషం అంటే సంతృప్తి వలన మనస్సు శుద్ధమవుతుంది అని. మనస్సు శుద్ధి అవుతే సమాజశాంతి, శ్రేయస్సుకు ఉపయోగపడే చక్కటి ఆలోచనలు కలుగుతాయి. దానివలన అమ్మవారు ఆనందించి అనుగ్రహిస్తారు.

ఏతత్ సర్వం శ్రీపరదేవతార్పణమస్తు - సూర్య.

శుభం భూయాత్

Comments

Popular posts from this blog

సీతమ్మతల్లికి సాటి ఎవరు? - చీమలపాటి సూర్యనారాయణ

అన్నదానం వల్ల ఎవరెవరికి పుణ్యం వస్తుంది - చీమలపాటి సూర్యనారాయణ

శ్రీసరస్వతీ దేవి పుట్టినరోజు నేడు,, శుభాకాంక్షలు అందరికీ - చీమలపాటి సూర్యనారాయణ