కోరిక తప్పు కాదు, అది ధర్మబద్ధంగా ఉండాలి - చీమలపాటి సూర్యనారాయణ
🙏"శ్రీమాత్రేనమః"🙏
" త్రివర్గదాత్రీ " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 760 వ నామం .
" త్రివర్గదాత్రీ " అంటే ధర్మార్ధకామములను ఇచ్చునది అని అర్ధం. చతుర్వర్గాలలో ఈ మూడింటికి మోక్షం కూడా కలుస్తుంది. ధర్మార్ధకామములు మూడూ ఒకదానికొకటి ఆధారం. ఆకలేస్తూంది. అన్నం కావాలన్నది కోరిక. అన్నం దొరికింది అంటే అర్ధం దక్కింది. ఎవరో ఆకలితో వచ్చాడు. కొంచెం అన్నం పెట్టాం. అది ధర్మం అయింది.
కోరిక తప్పు కాదు. ఉండాలి. లోకకళ్యాణం కోసం యజ్ఞం చేయాలన్నది కూడా కోరికే. కాని కోరిక ధర్మంతో కూడుకున్నదవుతే అమ్మవారు అర్ధం/ధనం కూడా సమకూరుస్తారు.
పరమాత్మ గీతలో ఇలా తెలియచేసారు:
" కర్మణః సుకృతస్యాహుః
సాత్వికం నిర్మలం ఫలం,
రజసస్తు ఫలం దుఃఖం
అజ్ఞానం తమసః ఫలం "
- భ.గీత 14:16
" శ్రేష్ఠములైన కర్మలను ఆచరించుటవలన సాత్విక ఫలము అనగా సుఖము, జ్ఞానము, వైరాగ్యము మొదలగు నిర్మలఫలములు కలుగును. రాజసకర్మలకు ఫలము దుఃఖము. తామసకర్మలకు ఫలము అజ్ఞానము " అని.
మంచి చేయకపోయినా పరవాలేదు కాని చెడు చేయకుండా ఉంటే చాలు. మనస్సులో కూడా ఇతరులకు హాని కలగాలని కోరుకోకపోవడం కూడా శ్రేష్టమైన కర్మయే. అలా చేస్తే సుఖము, జ్ఞానము, వైరాగ్యము వంటి నిర్మలఫలములు కలుగుతాయని తెలుస్తూంది. వైరాగ్యము కలగడమే మోక్షానికి మొదటి మెట్టు.
" తన్మే మనః శివసంకల్పమస్తు - సంకల్ప సూక్తం ". మా మనస్సులలో ఎల్లప్పుడూ మంచి ఆలోచనలే కలిగించు తల్లీ అని అమ్మవారిని వేడుకుందాం.
ఏతత్ సర్వం శ్రీపరదేవతార్పణమస్తు - సూర్య.
శుభం భూయాత్
Comments
Post a Comment