భక్తులకు అడగకుండానే అన్నీ సమకూరుస్తారు పరమాత్మ - చీమలపాటి సూర్యనారాయణ
🙏"శ్రీరస్తు శుభమస్తు"🙏
" భక్త్వా మామభిజానాతి
యావాన్యశ్చాస్మి తత్వతః,
తతో మాం తత్వతో
జ్ఞాత్వా విశతే తదనంతరం "
- భ.గీత 18:55
" బ్రహ్మభూతుడైన యోగి ఈ పరాభక్తిద్వారా నేనెవరినో, ఎంతటివాడనో యధాతధముగ నా తత్వమును తెలిసికొనును. అట్లు భక్తితో నా తత్వమును గ్రహించిన వెంటనే అతడు నాలో లీనమగును ".
కుచేలుడు భార్య కోరికననుసరించి కృష్ణుడిని కలవడానికి వెడతాడు.
" కుచైలం మలినం క్షామం
ద్విజం ధమనిసంతతం "
- భాగవతం 10(2):80:23
కుచేలుడు మాసిపోయిన చిరుగుల వస్త్రంలో నరాలు కనిపిస్తూ కరువుకు మారురూపంలా ఉన్న పేద బ్రాహ్మణుడు.
అసలు తనను లోపలికి వెళ్ళనిస్తారా. కృష్ణుడి దర్శనం అవుతుందా, నన్ను గుర్తుపడతాడా. అన్నీ సందేహాలే కుచేలుడికి. ఇలా ఆలోచన చేస్తూండగానే కృష్ణుడి అంతఃపుర ద్వారం ముందరకు చేరాడు. భక్తులకు ఏ అడ్డంకులూ లేకుండా చూస్తారు పరమాత్మ.
అతనిని చూడగానే కృష్ణుడు ఒక్క అంగలో వెళ్ళి గాఢంగా ఆలింగనం చేసుకున్నారు. కుచేలుడు కన్నీళ్ళ పర్యంతమయాడు. కుచేలుడు ఊహించని అనుగ్రహం ఇది.
కుచేలుడిని హంసతూలికా తల్పం పై కూర్చోపెట్టి గురుకుల విషయాలు మాట్లాడుతూ మన గురువులు మనల్ని ధనము, సంపదలతో వర్ధిల్లమని ఆశీర్వదించారు కనుక వాటికి లోటు ఉండదు అంటారు కృష్ణుడు.
అప్పుడు కుచేలుడు ఇలా అంటాడు:
" యస్యచ్ఛన్దోమయం బ్రహ్మ
దేహ ఆవపనం విభో,
శ్రేయసాం తస్య గురుషు
వాసో2త్యంత విడంబనం "
- భాగవతం 10(2):80:45
" ఓ సర్వశక్తిమంతుడైన ప్రభువా, నీ శరీరం వేదాల రూపంలో సంపూర్ణ సత్యాన్ని కలిగి ఉంది మరియు తద్వారా జీవితంలోని అన్ని శుభ లక్ష్యాలకు మూలం. మీరు ఆధ్యాత్మిక గురువుగారి పాఠశాలలో నివాసం ఏర్పరచుకోవడం మీ కాలక్షేపాలలో ఒకటి, ఇందులో మీరు మానవుని పాత్రను పోషిస్తారు " అంటారు సుదాముడు.
ఇక్కడ కుచేలుడు అన్నది " గురువుల ఆశీర్వాదం ఫలించాలన్నా జగద్గురువు అయిన నీ అనుగ్రహం ఉండాలిగా " అని.
కుచేలుడికి కృష్ణుడు ఎవరో, ఎంతటివారో పూర్తి అవగాహన ఉంది. అందుకే ఏమీ అడగకుండానే పరమాత్మ అనుగ్రహాన్ని సంపూర్ణంగా పొందారు, ముక్తి చెందారు.
ఏతత్ సర్వం శ్రీకార్తీకదయాదామోదరార్పణమస్తు - సూర్య.
శుభం భూయాత్
Comments
Post a Comment