అమ్మవారు మన కర్మలకు కేవలం సాక్షి మాత్రమే - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏

" నిష్క్రియా " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 182 వ నామం .

" నిష్క్రియా " అంటే ఏ క్రియలు లేనిది.

క్రియ, అంటే పని, ఎప్పుడు చేస్తాం. ఏదయినా కోరిక తీరడం కోసం. మరి అమ్మవారికి కోరికలు ఏముంటాయి. ఆవిడ‌ పొందవలసినదీ లేదు, పొందిందీ లేదు. 

జీవుడు జన్మలు తీసుకునేదే సంచితకర్మఫలం అంతా అనుభవించి ముక్తి పొందడానికి. ఆత్మజ్ఞానం గొప్పది. ఏది మంచో ఏది చెడో తెలుసుకునే విచక్షణ ఉంది ఆత్మకు. ప్రారబ్దకర్మ సంచితకర్మలో భాగం. కర్మఫలం అనుభవంలోకి రావడం, మొదలవడమే ప్రారబ్దకర్మ. అనుభవించేస్తే కొంత తగ్గిపోతుంది. కాని ప్రకృతి మాయ చేస్తుంది. జీవుడు మాయలో పడిపోయి తప్పులు చేస్తూనే ఉంటాడు. పునరపి మరణం, పునరపి జననం - సంసారచక్రం తిరుగుతూనే ఉంటుంది.

కేనోపనిషత్తు జ్ఞాన, కర్మేంద్రియాలు,మనస్సు కూడా జడమే, వీటిచేత ఆత్మ చేతనంగా ఉండి పనిచేయిస్తూంది అని తెలియచేస్తూంది. మరి ఆత్మ చేతనంగా ఉండి ఇంద్రియాల చేత తన శక్తితో పనిచేయిస్తూందంటే, ఇవన్నీ ఇలా పనిచెయ్యాలనే ఇచ్ఛ ఆత్మకు ఉందా?.

లేదంటుంది ఈ ఉపనిషత్తు.  ఆత్మ వాటికి దగ్గరగా ఉండడం వల్ల శక్తినిస్తుంది తప్ప అవి ఎలా పని చెయ్యాలి అన్నది దాని పని కాదు. ఒక మానవుని ప్రవర్తన/కర్మలు ఎలా ఉండాలనేది ఆ మానవుని పూర్వజన్మ వాసనల మీద ఆధారపడి ఉంటుందని, ఆత్మ 'సాక్షి' మాత్రమేనని ఈ ఉపనిషత్తు ప్రతిపాదిస్తూంది. ఆత్మ అమ్మవారి చైతన్యం, అమ్మవారి లాగే నిష్క్రియ.

పరమాత్మ గీతలో ఇలా తెలియచేసారు:

" నాదత్తే కస్యచిత్పాపం 

  న చైవ సుకృతం విభుః

  అజ్ఞానేనావృతం జ్ఞానం 

  తేన ముహ్యంతి జన్తవః "

           - భ.గీత 5:15

" సర్వవ్యాపి అయిన భగవంతుడు ఎవరి పాపపు లేదా పుణ్య కార్యాలలో తనను తాను ప్రమేయం చేసుకోడు. జీవులు భ్రాంతి చెందుతారు, ఎందుకంటే వారి అంతర్గత జ్ఞానం అజ్ఞానంతో కప్పబడి ఉంటుంది " అని.

అమ్మవారి పాదాలను ఆశ్రయిస్తే అజ్ఞానంలో కూరుకుపోకుండా అనుగ్రహిస్తారు.

ఏతత్ సర్వం శ్రీపరదేవతార్పణమస్తు - సూర్య.

శుభం భూయాత్

Comments

Popular posts from this blog

సీతమ్మతల్లికి సాటి ఎవరు? - చీమలపాటి సూర్యనారాయణ

అన్నదానం వల్ల ఎవరెవరికి పుణ్యం వస్తుంది - చీమలపాటి సూర్యనారాయణ

శ్రీసరస్వతీ దేవి పుట్టినరోజు నేడు,, శుభాకాంక్షలు అందరికీ - చీమలపాటి సూర్యనారాయణ