స్వర్గం మాకు వద్దు అనే భక్తులు కూడా ఉంటారు - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏

" స్వర్గాపవర్గదా " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 764 వ నామం .

" స్వర్గాపవర్గదా " స్వర్గమును, మోక్షమును ఇచ్చునది అని అర్ధం.

స్వర్గం తాత్కాలికసుఖం. మళ్ళీ భూమిమీద పుట్టి సంసారచక్రబంధంలో పడే అవకాశం ఉంది. మోక్షం అంటే జన్మరాహిత్యం. అమ్మవారు రెండూ అనుగ్రహిస్తారు వారి వారి కోరికకు, సాధనకు తగ్గట్టుగా.

కఠోపనిషత్తు సాధనకు రెండు మార్గాలు ప్రతిపాదించింది:

" శ్రేయస్చ ప్రేయస్చ మనుష్యమేతః

  తౌ సంపరీత్య వివినక్తి ధీరః "

                          - 1.2.2

జీవనయానంలో మానవుని ముందు రెండు మార్గాలున్నాయి.  మొదటిది శ్రేయోమార్గం - ఇది జ్ఞాన సముపార్జన ద్వారా శ్రేయస్సు వైపుకు నడిపించి శాశ్వతానందాన్ని, పరిపూర్ణతను చేకూరుస్తుంది - మోక్షం . రెండవది ప్రేయో మార్గం - ఇది ప్రియం కలుగజేసేది.  కర్మానుష్టానం ద్వారా కొంత అభ్యుదయం కలిగించినా అది అశాశ్వతము, దుఃఖ హేతువు అవుతుంది - స్వర్గం.

ముద్గలుడు అని ఓ బ్రాహ్మణుడు ఉండేవారు. సత్యనిష్ఠాగరిష్టుడు. " పక్ష ఉపవాసం " అనే వ్రతం పాటించేవాడు - అంటే పాడ్యమి నుండి చతుర్ధశి దాకా ఉపవాసం ఉండి పౌర్ణమి/అమావాస్య నాడు మాత్రమే భోజనం చేయడం. ఇతనిని పరీక్షించి సంతోషించిన దుర్వాసమహర్షి ఇతనికి స్వర్గలోకవాసాన్ని వరంగా ఇచ్చారు. దేవతలు వచ్చారు ఈయన్ని స్వర్గానికి తీసుకుని వెళ్ళడానికి. " పుణ్యఫలం అయిపోగానే మళ్ళీ భూలోకంలో పుట్టేదానికి స్వర్గవాసం ఎందుకు. నేను ఇక్కడే ఉండి జన్మరాహిత్యం కోసం సాధన చేసుకుంటాను. మీరు వెళ్ళండి " అన్నాడు ముద్గలుడు.

అపవర్గ అంటే పవర్గ లేనిది . అంటే ప ఫ బ భ మ లేనిది. ప - పాపం, పుణ్యం, ఫ - ఫలం, బ - బంధము, భ - భయం, మ - మరణం - ఇవి లేని స్థితి మోక్షం. అమ్మవారు అపవర్గప్రదాయని.

సాధకులకు వారివారి కోరికలకు అనుగుణంగా అమ్మవారు స్వర్గాన్ని, మోక్షాన్ని కూడా అనుగ్రహిస్తారు.

అమ్మవారి పాదాలను ఆశ్రయిస్తే అమ్మవారు కోరుకున్నవన్నీ అనుగ్రహించగలరు.

ఏతత్ సర్వం శ్రీపరదేవతార్పణమస్తు - సూర్య.

శుభం భూయాత్

Comments

Popular posts from this blog

సీతమ్మతల్లికి సాటి ఎవరు? - చీమలపాటి సూర్యనారాయణ

అన్నదానం వల్ల ఎవరెవరికి పుణ్యం వస్తుంది - చీమలపాటి సూర్యనారాయణ

శ్రీసరస్వతీ దేవి పుట్టినరోజు నేడు,, శుభాకాంక్షలు అందరికీ - చీమలపాటి సూర్యనారాయణ