మంత్రం అంటే పెద్దగా కఠినంగా ఉండాలనేమీ లేదు - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏

" మహామంత్రా " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 227 వ నామం.

" మహామంత్రా " అంటే మంత్రస్వరూపురాలు అమ్మవారు.

" మననాత్ త్రాయతే ఇతి మంత్రః " - మననం అంటే మాటిమాటికీ స్మరిస్తే రక్షిస్తుంది మంత్రం.

మంత్రాన్ని గురు ముఖంగా గ్రహించాలి. తల్లిదండ్రులను గురువును స్మరించుకుని మంత్రజపం చేస్తూ ఉండాలి.

" యస్య దేవే పరాభక్తిః

  యధా దేవే తధా గురౌ "

                - కఠోపనిషద్

" ఏ దేవి అనుగ్రహం కోసం జపం చేస్తున్నామో ఆ దేవిమీద అఖండభక్తి ఉండాలి. అంతే భక్తి గురువుమీద ఉండాలి " అని కఠోపనిషద్ తెలియచేస్తూంది.

" శ్రీరామ జయరామ జయజయ రామ " - ఇది 13 అక్షరాల మంత్రం. భక్త రామదాసు 13 కోట్ల జపం చేసారు. శ్రీరాముడి అనుగ్రహంతో చిరస్మరణీయుడు అయారు.

మామేనత్తగారు దృష్టి ( దిష్టి ) మంత్రం వేసేవారు. మంగళవారం, శుక్రవారం తప్ప మిగతా రోజుల్లో సాయంత్రం సూర్యాస్తమయ సమయంలో వీభూతి మంత్రించి ఇచ్చేవారు. ప్రక్క గ్రామాలవారు కూడా వస్తూండేవారు. ఓ గ్రహణసమయంలో నేను మాగ్రామంలో ఉండడంతో ఆవిడ " రేపు గ్రహణసమయంలో స్నానం చేసి రా, మంత్రోపదేశం చేస్తాను " అన్నారు. వెళ్ళాను. మొదట మా మేనత్త అన్నారు " మంత్రం వినగానే ' ఇదేమిటి, ఇదామంత్రం ' అనే ఆలోచన రానీయకు " అని. నమ్మకం ముఖ్యం, ఆరోజు మొదలుకుని గత 40 ఏళ్ళకు పైగా రోజూ కనీసం 11 సార్లు దానిని మననం చేస్తూంటాను.

శ్రీరామ, నమో భగవతే వాసుదేవాయ, నమో నారాయణాయ వంటి మంత్రాలు తేలిక అయిన పదాలతో మంత్రాలేనా అనిపిస్తాయి. గట్టి మంత్రం తేలిక మంత్రం అంటూ ఏమీ ఉండదు. గురువు ఉపదేశించే మంత్రం మన సాధనా సామర్ధ్యానికి తగ్గట్టుగా ఉంటుంది. నారదుడు రత్నాకరుడికి రామ మంత్రం ఉపదేశించారు. ఆ మంత్రజపంతో వాల్మీకి మహర్షి అయాడు రత్నాకరుడు.

సత్కర్మలు, అసత్కర్మలు అంటారు. అసత్కర్మలు అంటే దొంగతనాలు, హత్యలు లాంటివి కావు. " అవుతుందంటావా " అనే అపనమ్మకంతో చేసే పనులు. ఏపని మొదలుపెట్టినా నమ్మకం ముఖ్యం. ఇక మంత్రజపానికి చెప్పేదేముంది.

నామస్మరణ చేస్తే చాలు అనుగ్రహిస్తారు అమ్మవారు. నాస్తి సంశయం.

ఏతత్ సర్వం శ్రీపరదేవతార్పణమస్తు - సూర్య.

శుభం భూయాత్

Comments

Popular posts from this blog

సీతమ్మతల్లికి సాటి ఎవరు? - చీమలపాటి సూర్యనారాయణ

అన్నదానం వల్ల ఎవరెవరికి పుణ్యం వస్తుంది - చీమలపాటి సూర్యనారాయణ

శ్రీసరస్వతీ దేవి పుట్టినరోజు నేడు,, శుభాకాంక్షలు అందరికీ - చీమలపాటి సూర్యనారాయణ