ధర్మార్థకామాలే కాదు మోక్షం కూడా ఇస్తారు అమ్మవారు - చీమలపాటి సూర్యనారాయణ
🙏"శ్రీమాత్రేనమః"🙏
" ముక్తిదా " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 736 వ నామం.
" ముక్తిదా " అంటే ముక్తి నిచ్చేది అని. ముక్తి అంటే మోక్షం, జన్మరాహిత్యం. మళ్ళీ ఈ జననమరణ చక్రంలోకి రాకుండా ఉండడం. జ్ఞానం మోక్షాన్ని ఇస్తుందా అని సందేహం చాలామందికి. సౌరసంహిత " జ్ఞానం విద్వాంసుల విద్వత్తు పెంచుతుంది కాని మోక్షాన్ని కలిగించదు " అని తెలియచేస్తూంది. జ్ఞానం కర్మ/కార్యంతో సంపాదించుకునేది. మోక్షం ఆత్మానుభూతి.
కూర్మపురాణం ముక్తి పొందడానికి పార్వతీదేవిని ఆశ్రయించాలి అని తెలియచేస్తూంది. బ్రహ్మాండపురాణం శాస్త్రీయముగాకాని, అశాస్త్రీయముగాకాని అమ్మవారిని పూజించినవారు తిరిగి సంసారమును పొందరు అని తెలియచేస్తూంది.
ముక్తి/మోక్షం గురించి విన్నా చదివినా మన మనస్సు భాగవతంలోకి ప్రవేశించాలి. శుకమహర్షి పరీక్షిత్తుమహారాజుకు ముక్తి కలగడానికి భాగవతసప్తాహం చేసారు. పరీక్షిత్తు అడుగుతాడు శుకమహర్షిని " బృందావనంలో ఎవరెవరికి ముక్తిని ప్రసాదించారు కృష్ణుడు " అని. గోపాలురకు, గోపికలకు, గోపబాలకులకు, గోవులకు, మట్టికి, చెట్లకు, ధూళికే కాదు బృందావనంలోని గడ్డిపరకలకు కూడా ముక్తిని ప్రసాదించారు కృష్ణుడు అని చెబుతారు శుకులు. బృందావనంలోని వారందరకీ వేరేగా ఏమీ సుఖదుఃఖాలు లేవు. కృష్ణుడు ఆనందంగా ఉంటే సంతోషం, బాధగా ఉంటే విచారం అంతే. ఎవరికయినా అపశకునాలు కనబడితే తనకో తనవారికో ఆపదేమో అనే బాధలేదు వారికి, కృష్ణుడికేమీ ఆపద కలగదు కదా అని భయపడిపోయేవారు. గోపికలు పిల్లలకు నీళ్ళు పోసినా, అలంకారం చేసినా, భోజనం చేయించినా, నిద్రపుచ్చినా ఆ పనులన్నీ కృష్ణుడికే చేస్తూన్న భావనలో ఉండేవారు.
బృందావనంలో ఎవరికీ వేదశాస్త్రజ్ఞానం లేదు, పూజలు పునస్కారాలు లేవు. ఉన్నదల్లా కృష్ణుడితో ఆత్మానుభూతి. అదే ముక్తికి సోపానం.
కృష్ణుడిని పరీక్షిద్దామని వచ్చి తప్పు తెలుసుకున్న బ్రహ్మ కృష్ణుడిని ప్రార్ధిస్తూ అంటారు " ఈ బ్రహ్మజన్మని ఎందుకిచ్చావయ్యా, ఈ గోపబాలకుల పాదధూళిగా పుట్టించినా నాజన్మ ధన్యమయి ఉండేది " అని. బృందావనంలోని వారి పాదధూళి కూడా ముక్తిని పొందింది.
ఏతత్ సర్వం శ్రీపరదేవతార్పణమస్తు - సూర్య.
శుభం భూయాత్
Comments
Post a Comment